ఇప్పుడంటే తణుకు ఒక పట్టణంగా ఎదిగింది. కానీ ఏడు దశాబ్దాల క్రితం అది ఒక పల్లెటూరు. పారిశ్రామిక వాసనలు లేని వ్యవసాయాధారిత ప్రాంతం. అక్కడ ఫ్యాక్టరీ స్థాపించాలన్న ఆలోచనే ఓ సాహసం. అదీ స్కూల్ ఫైనల్ వరకు మాత్రమే చదువుకున్న వ్యక్తి అలాంటి బృహత్కార్యానికి నడుం కట్టడం గొప్ప విషయం. హరిశ్చంద్రప్రసాద్ 1921 జులై 28న తూర్పుగోదావరి జిల్లా పెదపట్నం అగ్రహారంలో జన్మించారు. ఆయనది సంపన్న, జమీందారీ కుటుంబం. తణుకులోనే చదువుకున్నారు. పారిశ్రామికవేత్తగా మారాలన్న ఆలోచన ఆ వయసులోనే ఆయనలో మొగ్గతొడిగింది. అప్పట్లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వానికి పారిశ్రామిక సలహాదారుగా ఉన్న ఐసీఎస్ అధికారి వెలగపూడి రామకృష్ణ సలహా మేరకు.. వ్యవసాయాధారిత పరిశ్రమ ఏర్పాటుచేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అప్పట్లో తణుకు చుట్టుపక్కల చెరకు ఎక్కువగా పండించేవారు. దాన్ని బెల్లం తయారీకే వినియోగించడంతో రైతులకు గిట్టుబాటు అయ్యేది కాదు. చక్కెర పరిశ్రమను స్థాపిస్తే ఉభయతారకంగా ఉంటుందన్న నిర్ణయానికి వచ్చారు. దేశానికి స్వాతంత్య్రం రావడానికి నాలుగు రోజుల ముందు.. 1947 ఆగస్టు 11న తణుకులో చక్కెర కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. 350 మంది సిబ్బందితో, 600 టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో మొదలైన ఆంధ్రాషుగర్స్... అనంతర కాలంలో బహుముఖంగా ఎదిగింది. ప్రస్తుతం ఆ సంస్థలో 12 వేల మంది ప్రత్యక్షంగా, మరెందరో పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు.
ఇప్పటికీ తణుకు నుంచే..
ఆంధ్రా షుగర్స్ ఒక కార్పొరేట్ సంస్థగా ఎదిగినా తణుకు కేంద్రంగానే కార్యకలాపాలు నిర్వహించారు. పలు ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలూ నిర్వహించారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ట్రస్ట్‌బోర్డు ఛైర్మన్‌గా పనిచేసి, పరిపాలన విభాగాన్ని పునర్వ్యవస్థీకరించారు. ముళ్లపూడి వెంకట్రాయుడు మెమోరియల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, మెడికల్ ట్రస్ట్‌ల ఆధ్వర్యంలో తణుకులో పాలిటెక్నిక్ కళాశాల, 450 పడకలతో ఆస్పత్రి స్థాపించారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల స్థాపనకు ప్రధాన దాతగా సహకరించారు. ఐ కేర్ సెంటర్, కార్డియోవాస్క్యులర్ సెంటర్లను ఏర్పాటు చేశారు. దువ్వ, వెంకట్రాయపురం, దొమ్మేరుల్లో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, తణుకులో గ్రంథాలయం, సాంస్కృతిక కేంద్రాలను ఏర్పాటు చేశారు. హరిశ్చంద్రప్రసాద్‌ని అనేక అవార్డులు, పురస్కారాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. అనకాపల్లి ప్రాంతీయ చెరకు పరిశోధన కేంద్రం ‘శర్కర కళాప్రపూర్ణ’ బిరుదు ప్రదానం చేసింది. జాతీయ అంతరిక్ష పరిశోధన రంగానికి అందించిన సేవలకు ఇస్రో ప్రశంసాపత్రం అందజేసింది. తానా లాంటి సంస్థలు ఆయనను జీవితకాల పురస్కారాలతో సత్కరించాయి. హరిశ్చంద్రప్రసాద్ తమ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల్నీ కుటుంబసభ్యుల్లానే చూసుకునేవారు. ఆయన హయాంలో సమ్మె అన్నదే జరగలేదంటే... వారిపై ఆయన ప్రేమాభిమానాలు చూపించడం, వారి బాగోగులు చూడటమే కారణమని చెబుతారు.
ఆహార్యం పల్లెటూరి పెద్దమనిషిదే..!
జీవితంలో ఎంత ఎదిగినా హరిశ్చంద్రప్రసాద్ నిరాడంబర జీవన విధానాన్నే అనుసరించారు. విదేశీ పర్యటనలకు వెళ్లినా... పంచెకట్టుతోనే కనిపించేవారు. చూసేవాళ్లకు ఒక విశాల పారిశ్రామిక సామ్రాజ్యానికి అధిపతిలా కాకుండా, పల్లెటూరి పెద్దమనిషిలానే అనిపించేవారు. సొంతూరిలో పాతకాలం మండువా ఇంట్లో ఉండటానికే ఇష్టపడేవారు.