తెలంగాణ

telangana

ETV Bharat / state

మినీ పోల్స్: సామాజిక మాధ్యమాల వేదికగా.. భాజపా విస్తృత ప్రచారం - Warangal Corporation Elections 2021

వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కమలనాథులు సరికొత్త పంథాను అనుసరిస్తున్నారు. కరోనా విపత్కర పరిస్థితులు, ప్రచారానికి కేవలం 5 రోజుల సమయమే ఉండటం వల్ల సామాజిక మాధ్యమం వేదికగా విస్తృత ప్రచారాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే ఒక విడత ప్రచారాన్ని పూర్తి చేసుకున్న కాషాయదళం సామాజిక మాధ్యమంతో పాటు కార్నర్‌ మీటింగ్‌లు, చిన్న చిన్న రోడ్‌ షోలు చేసేందుకు భాజపా రాష్ట్ర నాయకత్వం కార్యాచరణ రూపొందిస్తుంది.

bjp
bjp

By

Published : Apr 23, 2021, 2:47 PM IST

పట్టభద్రుల ఎన్నికల్లో సిట్టింగ్‌ స్థానాన్ని సైతం కోల్పోయిన కమలనాథులు కార్పొరేషన్‌ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు. ఆరు నెలల నుంచే క్షేత్ర స్థాయిలో ఆందోళనలు ప్రచారాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. పోలీంగ్‌ బూత్‌ స్థాయి నుంచి మొత్తం కార్పొరేట్ వరకు ఇంఛార్జ్‌లను నియమించింది. నెల రోజుల కిందటే భాజపా తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేసుకుంది. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ తరుణ్‌చుగ్‌, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు రాష్ట్ర నాయకత్వం తొలి విడత ప్రచారంలో పాల్గొంది.

తెరాస వైఫల్యాలపై ఫోకస్

తొలి విడత ప్రచారంలో భాగంగా తెరాస ప్రజా వ్యతిరేక విధానాలను భాజపా నేతలు తీవ్ర స్థాయిలో ఎండ గట్టారు. అధికార పార్టీ కార్పొరేటర్ల అవినీతి, ఎమ్మెల్యేల అవినీతి, భూకబ్జాలు, రెండు పడక గదుల ఇళ్ల హామీ, నగరంలోని డ్రైనేజ్‌ వ్యవస్థ, కొవిడ్‌ అరికట్టడంలో తెరాస ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. భాజపా ఆరోపణలతో కొన్ని చోట్ల తెరాస సిట్టింగ్‌లకు టికెట్‌ నిరాకరించి కొత్త వారికి అవకాశం కల్పించింది. ఒక వైపు తెరాస వైఫల్యాలు మరో వైపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి సఫలమయ్యారు. స్మార్ట్‌ సిటీస్‌, హెరిటేజ్‌, అమృత్‌ పథకాల కింద ఇచ్చిన నిధులు, బాహ్యవలయ రహాదారులు, జాతీయ రహాదారుల ఏర్పాటు వంటి అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తోంది. భాజపాకు అవకాశం కల్పిస్తే కేంద్రం నిధులతో ఆకర్షణీయమైన నగరంగా తీర్చిదిద్దుతామంటూ ప్రచారం సాగిస్తున్నారు.

సామాజిక మాధ్యమాల్లో…

నామినేషన్ల ఉపసంహారణ ప్రక్రియ ముగియడంతో రెండో విడత ప్రచారంపై భాజపా దృష్టి కేంద్రీకరించింది. ప్రచారానికి కేవలం 5 రోజుల సమయమే ఉండటంతో పాటు కరోనా విజృంభిస్తుండడంతో బహిరంగ సభలు, పెద్ద పెద్ద రోడ్‌ షోలు నిర్వహించవద్దని యోచిస్తోంది. కేవలం సామాజిక మాధ్యమంతో పాటు కార్నర్‌ మీటింగ్స్‌, చిన్న చిన్న రోడ్‌ షోలు చేయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి కార్యాచరణ రూపొందిస్తుంది. కీలకంగా మారిన ఈ 5 రోజులు ఎవరెవ్వరితో ఎక్కడెక్కడ ప్రచారంలో దింపాలనే అంశాలపై ప్రణాళికలు రచిస్తోంది. తెరాస అవినీతి, అక్రమాలే వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల్లో భాజపాను గెలిపిస్తాయని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: 30 సర్కిళ్ల పరిధిలో 63 మినీ కంటైన్‌మెంట్ జోన్లు

ABOUT THE AUTHOR

...view details