రోజూ ఎన్నో విషయాల గురించి తెలుసుకుంటాం. వాటి నుంచి కొన్ని సందర్భాల్లో ప్రేరణ పొందుతాం. మనమూ ఇలా చేస్తే బాగుంటుంది కదా అనుకుంటాం. కొన్ని రోజులకు ఆ సంగతే మరచిపోతాం. హైదరాబాద్‌కు చెందిన దీక్షిత్ బండారి మాత్రం ఆ పని చేయలేదు. స్ఫూర్తినిచ్చిన కళలో ఏళ్ల తరబడి సాధనతో ప్రత్యేకకళలో తనదైన ముద్ర వేస్తూ ప్రతిభ చూపుతున్నాడు.
సత్తా చాటాడు
ప్రస్తుతం డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న దీక్షిత్ బండారి... పరికరాలు అవసరం లేకుండానే సంగీతాన్ని సృష్టించే బీట్ బాక్సింగ్‌లో రాణిస్తున్నాడు. నోటితోనే రకరకాలుగా ధ్వనులు చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. గొంతుతో అద్భుత శబ్ధాలు పుట్టిస్తూ.. ఆకట్టుకునే పాటలతో సత్తా చాటుతున్నాడు.
పలు ప్రదర్శనలు
బీట్ బాక్సింగ్ నేర్పేందుకు ప్రత్యేకంగా గురువులు, శిక్షణ సంస్థలేవి అందుబాటులో లేవు. టీవీలో..స్నేహితుడి ద్వారా ఈ కళపై ఆసక్తి పెంచుకున్నాడు దీక్షిత్. అంతర్జాలంలో సూచనలు పాటిస్తూ.. సాధన చేసి ప్రావీణ్యం సాధించాడు. పలు ప్రదర్శనలిచ్చి గుర్తింపు తెచ్చుకున్నాడు. అరుదైన ఈ ప్రక్రియలో నూతన ఒరవడి సృష్టిస్తున్నాడు దీక్షిత్.