గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీలు), అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దాదాపు అన్నిచోట్ల ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో 97, మేడ్చల్ జిల్లాలో 79, రంగారెడ్డి జిల్లాలో 20 కేంద్రాల్లో పరీక్షలు కొనసాగుతున్నాయి. 30 నిమిషాల్లోనే ఫలితం చెప్పేస్తున్నారు. పాజిటివ్ వస్తే...కరోనా ఉన్నట్లే. లక్షణాలు ఉన్నవారికి ఒకవేళ నెగెటివ్ వస్తే మాత్రం అనుమానించాల్సిందేనని వైద్యులే అంటున్నారు. ఇలాంటి వారు తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ టెస్టు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
ఈ పరీక్ష ఫలితానికి 2 నుంచి 3 రోజులు పడుతోంది. అందువల్ల ఈ పరీక్షకు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. లక్షణాలు తీవ్రమై ఆరోగ్య పరిస్థితి ముదిరాక ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ఇలాంటి వారి ఊపిరితిత్తులకు సీటీ స్కాన్ చేసి కరోనా ఇన్‌ఫెక్షన్ ఉందా? లేదా? నిర్ధారిస్తారు. కరోనా ఇన్‌ఫెక్షన్ ఉంటే ఆమేరకు చికిత్సలు అందిస్తారు. జ్వరం, గొంతునొప్పి, జలుబు, ఆయాసం, గుండె పట్టేసినట్లు ఉంటే...అన్ని రకాల పరీక్షలు చేయించుకోవడం మేలని వైద్యులు చెబుతున్నారు. 95 శాతం వరకు ఆర్టీ-పీసీఆర్‌లో తెలుస్తుంది. ఒకవేళ ఈ టెస్టులో నిర్ధారణ కాకపోతే...అప్పుడు ఛాతీ ఎక్స్‌రే, లేదంటే సీటీ స్కాన్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చాలా పీహెచ్‌సీల వద్ద ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయడం లేదు. కేవలం యాంటీజెన్‌లతో సరిపెడుతున్నారు. అవసరమైన వారికి ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలని సూచిస్తున్నారు. నెగెటివ్ వచ్చింది కదా అని కొందరు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రెండు, మూడు రోజుల తర్వాత పరిస్థితి విషమించి ఆర్టీ పీసీఆర్ పరీక్షకు వెళుతున్నారు. అక్కడ నిర్ధరణ అయిన వారు అప్పటి వరకు బయట తిరగడం మరికొందరికి కరోనా సోకుతోంది.
పది చోట్ల ఉచితంగానే పరీక్షలు