అవినీతి నిరోధక శాఖ(అనిశా) గత ఏడాది నమోదు చేసిన కేసులు తక్కువే అయినా అనేకం వేటికవే ప్రత్యేకంగా నిలిచాయి. కరోనా కారణంగా మూడు నెలలపాటు ప్రభుత్వ కార్యాలయాల్లో లావాదేవీలు దాదాపుగా నిలిచిపోయినా ఆంక్షలు సడలించాక నమోదైన కేసులు చాలా వరకు అనిశా చరిత్రలోనే ప్రత్యేకతను ఆపాదించుకున్నాయి.
రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన రూ.1.1 కోట్ల లంచం సొమ్ము.. రూ.1.12 కోట్ల లంచం కేసులో చిక్కిన సంయుక్త కలెక్టర్.. కళ్లు చెదిరే రీతిలో ఒకే అధికారి నుంచి రూ.8.75 కోట్ల జప్తు.. ఓ అధికారికి చెందిన సుమారు రూ.100 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు.. ఇలా పలు కేసులు చర్చనీయాంశమయ్యాయి.
కొడితే రూ.కోట్లే...
అక్రమాలకు పాల్పడుతూ అనిశాకు చిక్కిన క్రమంలో అధికారులకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేసిన సందర్భాల్లో రూ.కోట్ల కొద్దీ ఆదాయానికి మించిన ఆస్తులు, దస్తావేజులు బహిర్గతమయ్యాయి.
* షాబాద్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తూ గత జులై 23న అనిశాకు చిక్కిన బొల్లం శంకరయ్యకు చెందిన రూ.4.51 కోట్ల అక్రమాస్తులు బయటపడ్డాయి.
* ఐఎంఎస్ కుంభకోణంలో చిక్కిన ఆ సంస్థ మాజీ సంచాలకురాలు డా.దేవికారాణి కేసు దర్యాప్తు క్రమంలో ఆమెకు సంబంధించిన రూ.8.75కోట్ల అక్రమాస్తుల్ని అనిశా స్వాధీనం చేసుకొంది. అనిశా చరిత్రలో ఇదో రికార్డు.
* కీసర తహసీల్దార్ నాగరాజు అధికార దుర్వినియోగానికి పాల్పడి భూరికార్డులు మార్చేందుకు రూ.1.1 కోట్ల భారీ లంచం తీసుకొంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కడం మరో రికార్డు.
* మల్కాజిగిరి ఏసీపీ యలమకూరి నర్సింహారెడ్డి గత సెప్టెంబరు 22న అనిశాకు దొరికిపోగా.. ఆయన ఇంట్లో రూ.4.02 కోట్ల ఆదాయానికి మించిన ఆస్తుల పత్రాలు లభించాయి. అనంతర సోదాల్లో సుమారు రూ.100 కోట్ల వరకు ఆస్తుల్ని గుర్తించారు.