ఇంటర్ చదివిన ఉమ.. భర్త ప్రేమన్‌తో ముంబయిలో అడుగుపెట్టింది. అందమైన జీవితాన్ని ఊహించుకుంది. ఆమెదేమో కోయంబత్తూరు. ఆయనదేమో కేరళలోని గురువాయూరు. కలతల్లేని కాపురం. అంతా బాగుందనుకుంటుండగా.. రహస్యంగా ఏవో మందులు వేసుకుంటున్నాడాయన. ఆమె దగ్గర ఇంకేదో దాస్తున్నాడు. కొన్నాళ్లకు అనారోగ్యం దాచి తనను పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. ఇంకొన్నాళ్లకు అది క్షయ అని తేలింది. భర్తను నిలదీయలేదు. తోడుగా నిలిచింది. ఆయనతో కలిసి తనూ పోరాడింది. ఎన్నెన్నో ఆసుపత్రులకు తీసుకెళ్లింది. నాలుగేళ్లకు వారికి ఓ కొడుకు పుట్టాడు. పిల్లాడికి రెండేళ్లు నిండేసరికి ఆమె భర్త కన్నుమూశాడు.
నిరుపేదకు కిడ్నీ...
వైద్యుల సమాచారం.. రోగులకు చేరవేసే క్రమంలో చాలామంది కిడ్నీ వ్యాధిగ్రస్థులు.. డయాలసిస్ చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారని గుర్తించింది. వాళ్లకు అండగా.. 20 ఏళ్ల కిందట ఓ సేవా సంస్థను ఏర్పాటు చేసింది. కేరళలో ఉచిత డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ 20 ఏళ్లలో దేశవ్యాప్తంగా 20 ఉచిత డయాలసిస్ కేంద్రాలను నెలకొల్పింది. కేరళ, తమిళనాడులో మొబైల్ డయాలసిస్ కేంద్రాల ద్వారా సేవలు అందిస్తోంది. కిడ్నీ మార్పిడిపై అవగాహన కల్పించడానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. కిడ్నీలు పాడైన ఓ నిరుపేద యువకుడికి తన కిడ్నీ ఇచ్చి ప్రాణదానం చేసింది.
ఇల్లు అమ్మి...
భర్త పోయాడు. ఒళ్లో రెండేళ్ల బాబు. ఉండటానికి ఓ ఇల్లు. నెల రోజులు భారంగా గడిచాయి. భవిష్యత్తు కనిపించడం లేదు. భర్తతో కలిసి ఆసుపత్రులు తిరిగిన రోజులే వెంటాడసాగాయి. తనలా ఇంకెందరు సరైన వైద్యం కోసం ఎక్కడెక్కడ తిరుగుతున్నారో అన్న ప్రశ్న మదిలో మెదిలింది. వారికోసం ఏదైనా చేయాలనుకుంది. పుట్టెడు బాధతో సరైన వైద్యం కోసం ఎదురుచూసే రోగులకు గుప్పెడు సమాచారం అందివ్వాలనుకుంది. ఉన్న ఒక్క ఇంటినీ అమ్మేసింది. ఆసుపత్రులు, వైద్యుల వివరాలను రోగులకు సకాలంలో అందించడానికి ఓ సమాచార కేంద్రం స్థాపించింది. ‘ఎక్కడెక్కడ ఎలాంటి వైద్య సేవలు లభిస్తాయి, ఏయే వ్యాధులకు ఏ వైద్యుడిని సంప్రదించాలి.. ఈ వివరాలన్నీ సేకరించా. వాటితో శాంతి మెడికల్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌ను ప్రారంభించా. తిరిగి రోగులను కలుసుకొని, వ్యాధి గురించి తెలుసుకొని.. వారికి సరైన వైద్యం ఎక్కడ లభిస్తుందో చెప్పడమే పనిగా పెట్టుకున్నా. మా నాన్న చిరుద్యోగి. అవసరార్థులకు తోచిన వైద్యం అందించేవారు. ఆయనలోని సేవా గుణమే నాకు స్ఫూర్తి’ అంటోంది ఉమ.