తెలంగాణ

telangana

ETV Bharat / state

జూన్ 1నుంచి గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం - గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం తాజా వార్తలు

గ్రామాల్లో బహిరంగంగా చెత్తవేసే వారి విషయంలో ఇకనుంచి ఉపేక్షించేది లేదని.. రూ. 500 జరిమానా వేసి తీరతామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. చెట్లు కొట్టే వారిపైనా కఠిన చర్యలు తప్పవన్న ఆయన.. విధుల్లో అలక్ష్యం వహించే ప్రజాప్రతినిధులు, అధికారులపై వేటు తప్పదని హెచ్చరించారు. పల్లెప్రగతితో గ్రామాలు శుభ్రమయ్యాయని.. అందుకే కరోనా బారిన పడలేదని ఆయన చెప్పుకొచ్చారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యల కోసం 8 రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ఎర్రబెల్లి తెలిపారు. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమవుతున్న నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రితో ఈటీవీ భారత్‌ ముఖాముఖి.

Special sanitation program in villages
జూన్ 1నుంచి గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం

By

Published : May 31, 2020, 10:43 AM IST

జూన్ 1నుంచి గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం


ప్ర: రెండు దఫాల్లో పల్లెప్రగతి అమలు చేశారు. ఇప్పుడు అమలు చేయబోతోన్న పారిశుద్ధ్య కార్యక్రమం ఉద్దేశం ఏమిటి?

జ: పల్లెప్రగతి నిరంతర కార్యక్రమం. పల్లెప్రగతితో గ్రామాల్లో పారిశుద్ధ్యం విషయంలో పరిస్థితులు చాలా మెరుగయ్యాయి. గ్రామాలు చాలా శుభ్రమయ్యాయి. ప్రతి నెలా రూ. 339 కోట్లు పంచాయతీలకు ఇస్తున్నాం. పల్లెప్రగతి గ్రామాల్లో కరోనా రాలేదు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులకు అవకాశం ఎక్కువ. దోమలు ఆగకుండా, నీరు నిల్వ లేకుండా మురుగునీటి కాల్వలు, ఖాళీ స్థలాలను శుభ్రం చేయాలి. రహదార్లపై గుంతలు పూడ్చాలి. గ్రామాలను పూర్తి పరిశుభ్రం చేయడమే లక్ష్యంగా జూన్ 1నుంచి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం.

ప్ర: 8 రోజుల కార్యక్రమంలో ప్రధానంగా ఏ అంశాలపై ఎక్కువగా దృష్టి సారిస్తారు?

జ: వేసవిలో గ్రామాల్లో రోడ్లపైనా, అక్కడక్కడా గుంతలు ఏర్పడ్డాయి. డ్రైనేజీ కొంత పాడైంది. వాటన్నింటినీ శుభ్రం చేయాలి. దోమలు, ఈగలకు ఆస్కారం లేకుండా చూడాలి. పాతబావులు, పెద్ద పెద్ద గుంతలు పూడ్చాలి. నర్సరీలకూ ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలి.

ప్ర: కార్యక్రమంలో మొదటి రోజు ఏం చేయాల్సి ఉంటుంది?

జ:మొదటి రోజు గ్రామపెద్దలందరూ సమావేశమై 8 రోజుల ప్రణాళికను ఖరారు చేయాలి. గ్రామాల్లో ఎవరికి వాళ్లు ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. గ్రామాల్లో ఎక్కడ చెత్త కనపడ్డా.. రూ.500 జరిమానా విధించాలి. ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలి. గ్రామాల్లో చెట్లు కొట్టే వారిపైనా చర్యలు తీసుకుంటాం. రాబోయే రోజుల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ప్ర: చెత్తవేస్తే జరిమానా అంటున్నారు. చెత్త సేకరణ పూర్తిస్థాయిలో జరుగుతుందా?

జ: గ్రామాల్లో చెత్త సేకరణ జరుగుతుంది. కానీ తడిచెత్త, పొడిచెత్త వేర్వేరుగా సేకరణ ఇంకా జరగడం లేదు. పూర్తిస్థాయిలో జరగాల్సిన అవసరం ఉంది. డంపింగ్ యార్డుల నిర్వహణ ఇంకా బాగా జరగాలి. ఎరువులు తయారు చేసి గ్రామాల్లో వినియోగించుకోవాలి. వైకుంఠదామాలకూ నిధులు పెంచాం. వర్షాకాలంలో మలేరియా లాంటి వ్యాధులు ప్రబలకుండా పటిష్ట చర్యలు తీసుకునేందుకే ఈ 8 రోజుల ప్రత్యేక కార్యక్రమం.

ప్ర: పల్లె ప్రగతిలో విరాళాలు సేకరించారు. స్పందన ఎలా ఉంది?

జ:విరాళాలు చాలా బాగా అందాయి. దమ్మన్నపేటలో నర్సింహారెడ్డి రూ. 25 కోట్లు ఇచ్చారు. హుస్నాబాద్‌లో భాస్కర్‌రావు రూ. 15 కోట్ల విరాళం ఇచ్చారు. ఇంకా చాలా చోట్ల చాలా మంది దాతలు, ప్రజాప్రతినిధులు, ఇతరులు ముందుకొచ్చారు. పూర్వ విద్యార్థులందరూ కలిసి పాఠశాలలను అభివృద్ధి చేసుకున్నారు.

ప్ర: 8 రోజుల కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర ఎలా ఉండబోతోంది?

జ: సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, కార్యదర్శులు ఎవరు నిర్లక్ష్యం చేసినా కఠిన చర్యలు ఉంటాయి. కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇచ్చాం. నిర్లక్ష్యం చేసినా, పాల్గొనకపోయినా, నిధులు దుర్వినియోగం చేసినా చర్యలు తప్పవు.

ప్ర: 8 రోజుల కార్యక్రమంలో ఆకస్మిక తనిఖీలు ఉంటాయా?

జ: నేను జిల్లాలకు వెళ్తాను. పంచాయతీరాజ్ కార్యదర్శి, కమిషనర్ కూడా జిల్లాలకు వెళ్తారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు గ్రామాల్లో పర్యటిస్తారు. కొందరు ఐఏఎస్ అధికారులనూ ప్రత్యేకంగా నియమిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచి వర్షాకాలంలో ఎలాంటి రోగాలు రాకుండా చూడడమే ఈ 8 రోజుల కార్యక్రమ ప్రధాన లక్ష్యం.

ఇదీచూడండి: రాత్రి కర్ఫ్యూ: ఆ సమయంలో బయటకొస్తే అంతే!

ABOUT THE AUTHOR

...view details