ఇటీవల వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా చేపట్టాల్సిన పారిశుద్ధ్య కార్యక్రమాలపై జీహెచ్ఎంసీ దృష్టిసారించింది. ఈ మేరకు దోమల వ్యాప్తిని అరికట్టేందుకు యాంటీ లార్వా స్ప్రేయింగ్, ఫాగింగ్ చేపట్టారు. చెరువులను బాగుచేసేందుకు నగరంలోని 39 చెరువుల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్కను తొలగిస్తున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ వివరించారు. పురపాలక మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు 185 చెరువులను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నట్లు మేయర్ వెల్లడించారు. చెరువు పరిసరాల్లో సోడియం హైపో క్లోరైట్ క్రిమిసంహారకాలను పిచికారి చేస్తున్నారు.
125 బృందాలు...
గ్రేటర్‌వ్యాప్తంగా 125 బృందాలు నీటి నిల్వ ప్రాంతాలు, నాలాల్లో యాంటీ మలేరియా స్ప్రేయింగ్ చేస్తున్నారు. వరదనీటిని తొలగించిన 252 ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా క్రిమి సంహారకాలు పిచికారీ చేస్తున్నారు. 2 లక్షల గంబూషియా చేపపిల్లలు, 6 వేల ఆయిల్ బాల్స్‌ను నాలాలు, కాలువలు, చెరువుల్లో వదిలారు. వారంలో అన్ని చెరువుల్లోనూ స్ప్రేయింగ్ పూర్తిచేసేలా అధికారులు పనిచేస్తున్నారు.