రాజధానిలో కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చిందని అనుకునేలోపు.. ఒక్కసారిగా పరిస్థితి తిరగబడింది. అప్పటి వరకు కేవలం మూడు కేసులకు పరిమితమైన ఎల్బీనగర్ జోన్‌లో మహమ్మారి విజృంభించింది. కరోనా ధాటికి మలక్‌పేట గంజ్ పేరు నగరమంతా మారుమోగింది. కార్వాన్ సర్కిల్ పరిధిలోని జియాగూడ, చుట్టుపక్కల ప్రాంతాల్లో, చార్మినార్ పరిసరాల్లో వైరస్ వ్యాప్తి పెరిగింది. మొత్తంగా చూస్తే శుక్రవారం వరకు ఎల్బీనగర్ జోన్ సర్కిల్లో 85, ఖైరతాబాద్‌లో 390, చార్మినార్‌లో 400ల కేసులు నమోదయ్యాయి. మెరుగైన చికిత్సతో అందులోని సగం మంది వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నారు. అయినప్పటికీ ఆ జోన్లలో వ్యాప్తి తగ్గట్లేదు. అదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రస్తావించారు. ఎల్బీనగర్, మలక్‌పేట, చార్మినార్, కార్వాన్ ప్రాంతాల్లోనే కేసులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేయడంతో గ్రేటర్ అధికారులు అప్రమత్తమయ్యారు. కట్టడి చర్యలను పకడ్బందీగా అమలు చేసేందుకు రంగంలోకి దిగారు.
సీఎం ఆదేశాలతో ఆ నాలుగు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి - ప్రత్యేక జాగ్రత్తలు
రాష్ట్రంలో ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసుల్లో దాదాపు హైదరాబాద్ నుంచే రావడం కలవరం పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్ విజృంభిస్తున్న ప్రాంతాల్లో కఠిన చర్యలు అమలు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రత్యేక దృష్టిని కనబరిచి... కట్టడి చర్యలు పకడ్బందీగా అమలు చేసేందుకు రంగంలోకి దిగారు.
ఎల్బీనగర్ పరిధిలో ఒక్కసారిగా పాజిటివ్ కేసులు పెరగడంతో కరోనా బాధితులుండే ప్రాంతాలను కంటెయిన్‌మెంట్ జోన్లుగా ప్రకటించి, కఠిన చర్యలు చేపట్టగా... పరిస్థితి కొంత వరకు అదుపులోకి వచ్చిందని అధికారులు తెలిపారు. చార్మినార్ జోన్ పరిధిలోనూ కరోనా కేసులు నమోదైన మలక్‌పేట, సంతోష్‌నగర్, మాదన్నపేట, పాతబస్తీలోని ఇతర ప్రాంతాలను దిగ్బంధించామని, వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని జోనల్ కమిషనర్ అశోక్ సామ్రాట్ తెలిపారు. సీఎం ఆదేశాలతో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని విస్తృతంగా పిచికారి చేయాలని ఉన్నతాధికారులు సిబ్బందికి ఆదేశాలిచ్చారు.
ఇవీ చూడండి:మన రైతు ప్రపంచ ఖ్యాతి పొందాలి