కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకొని ఇంటికెళ్లాక అనారోగ్య సమస్యలతో బాధపడే వారికోసం కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేకంగా ‘పోస్ట్-కొవిడ్ క్లీనిక్’ ఏర్పాటు చేశారు. జనరల్ ఫిజీషియన్, శ్వాసకోశ వ్యాధుల నిపుణులు, మానసిక వైద్య నిపుణులు వివిధ సమస్యలతో వచ్చేవారికి కౌన్సిలింగ్ ఇచ్చి, అవసరమైన చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ క్లీనిక్‌కు మంచి స్పందన లభిస్తోంది. ప్రసుత్తం క్లీనిక్‌లో ఎలాంటి సేవలు అందిస్తున్నారు..? ప్రజలు ఏ తరహా సమస్యలతో వస్తున్నారు..? వారికిచ్చే సలహాలు, సూచనలేమిటి..? ఆసుపత్రి వైద్యాధికారులు, వైద్య నిపుణుల మాటల్లోనే...
భయమే శత్రువు
ఒకసారి కొవిడ్ వచ్చి పోయిన తరువాత బాధితుల్లో యాంటీబాడీస్ వస్తాయి. కానీ.. తమ దగ్గరకు వస్తున్న ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ ఎప్పుడు వేసుకోవచ్చని అడుగుతున్నారు. 40-50 ఏళ్ల మధ్యవారు ఎప్పటికప్పుడు మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవాలి. పోస్టు కొవిడ్‌లో హృద్రోగాలు రావడం గమనిస్తున్నాం. కాబట్టి ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదిస్తే మంచిది. చాలా మంది వైద్యుల అనుమతి లేకుండానే స్టెరాయిడ్స్ వాడేస్తున్నారు. అది బ్లాక్ ఫంగస్ వంటి సమస్యలకు కారణమవుతోంది. మందులు వాడే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.
మధ్య వయస్కులు కాస్త జాగ్రత్త
ఒక్కసారి ఐసీయూ వరకు వెళ్లిన వ్యక్తి కొవిడ్‌ను జయించాడంటే అతనికది పునర్జన్మే. ఇలాంటి చాలా మందిలో ఆ మహమ్మారీ మళ్లీ సోకుతుందేమోనన్న భయం ఎక్కువగా కనిపిస్తోంది. దాంతో మానసిక ఆందోళనలకు గురవుతున్నారు. ఇలాంటి భయాలు మంచిది కాదు. సాధారణంగా ఏదైనా వైరస్ సోకినప్పుడు లేదా అనారోగ్యానికి గురైనప్పుడు దాని ప్రభావం మెదడుపై కూడా ఉంటుంది. అది నిద్రలేమికి కారణమవుతుంది. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. ముఖ్యంగా కొవిడ్ చికిత్సలో స్టెరయిడ్స్ వినియోగిస్తుంటారు. దీనివల్ల కొంత రోగ నిరోధక శక్తి తగ్గవచ్ఛు అలాగని అది దీర్ఘకాలిక సమస్య కాదు. పౌష్టికాహారం తీసుకుంటే చాలు. కానీ.. భయం అనేది మనిషిని తెలియకుండానే కుంగదీస్తుంది. ఈ భయాలకు సామాజికపరమైన అంశాలు ప్రధాన కారణం. కొవిడ్ సోకిందని తెలిస్తే అంటరానివారుగా చూడటం, ఆప్యాయంగా పలకరించేవారు లేకపోవడం ఓ కారణమే. అయినవాళ్లు అందుబాటులో ఉంటూ, నేనున్నాననే భరోసా ఇస్తుంటే బాధితుల రికవరీ శాతం కూడా పెరుగుతుంది.
కొవిడ్ తర్వాత కొన్ని సమస్యలు సాధారణమే