Srikalahasti pala kova: ఏపీలోని తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి అంటే గుర్తొచ్చేది.. అక్కడి శ్రీకాళహస్తిశ్వరుడి ఆలయం. కానీ అక్కడికి వెళ్లిన వారికి ఎప్పటికీ గుర్తుండిపోయేది మరొకటి ఉంది. అదే పాలకోవా. ఆ కోవా రుచి చూసిన వారెవరూ దాన్ని మరచిపోలేరు. శ్రీకాళహస్తి పాలకోవా... దాదాపు 7 దశాబ్దాలుగా ప్రాచుర్యంలో ఉంది. పరిసర ప్రాంతాల్లోని పాడి రైతుల నుంచి సేకరించిన పాలతో దీనిని తయారుచేస్తారు. కేవలం పాలు, చక్కెరతో... యంత్రాల సాయం లేకుండా చేతులతో తయారుచేసే ఈ కల్తీలేని కోవా అంటే... సామాన్యులకే కాదు ఎంతో మంది ప్రముఖులకూ చాలా ఇష్టం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోనూ... శ్రీకాళహస్తి పాలకోవాపై ఓ డైలాగ్ వాడారు. చిత్ర బృందం... కాళహస్తికి వచ్చి మరీ ఇక్కడి పాలకోవాను తీసుకెళ్లారు..
"43 గ్రామాలలో నేరుగా రైతుల దగ్గర నుంచే పాలను సేకరిస్తాము. ఇందులో 1000లీటర్ల పాలను కోవా, ఐస్‌క్రీమ్, భాసంతి తయారీకి ఉపయోగిస్తాము. పాలకోవాను మెషిన్స్తో కాకుండా మ్యాన్యువల్‌గా తయారుచేయటం ద్వారా కోవా బాగా రుచికరంగా వస్తుంది." -మధుసూదనరావు, ఛైర్మన్, శ్రీకాళహస్తి పాల సరఫరా సంఘం