- మీకు మరో ఆరేళ్ల సర్వీస్ ఉన్నా.. స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. ఎందుకు?
పేద ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతోనే పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నాను. ఈ విశాలమైన ప్రపంచంలో పేదల కోసం, వారి కుటుంబాల కోసం, భవిష్యత్ తరాల కోసం మరింత గొప్పగా పని చేయాలనుకుంటున్నాను. అందుకే ఐపీఎస్ పదవిని వదిలేస్తే.. ఇంకా ఏదైనా గొప్ప భూమిక లభిస్తే అక్కడ చేద్దామని అనుకుంటున్నా.
- గురుకులాల కార్యదర్శిగా ఇప్పటికే పేద పిల్లలకు అండగా ఉంటున్నారు. ఆ దిశగా సాగుతున్న క్రమంలో ఒక్కసారిగా ఈ ప్రకటనను ఏ విధంగా చూడొచ్చు?
గురుకులాల విద్యార్థులు ఎక్కడికెళ్లినా నిలదొక్కుకోగలుగుతారు. వారికి ఒక ఐడియాలజీ ఇచ్చాము. ఆ ఐడియాలజీతో పిల్లలందరూ గొప్పగా చదువుకుంటారనే నమ్మకంతోనే బయటికి వచ్చాను. ఇలా బయటకు వచ్చింది నా సొంత పనులు చేసుకునేందుకు కాదు.. విద్యార్థుల గొప్ప కలలను నిజం చేయడానికి వచ్చాను.
- ప్రవీణ్‌కుమార్ రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తున్నారంటూ పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంతవరకు నిజముంది?
సూర్యుడు పడమర నుంచి ఉదయిస్తాడని చెప్పడం ఎంత తప్పో.. ఇది కూడా అంతే తప్పు.
- భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది?
ముందుగా నా వ్యక్తిగత పనులు కొన్ని చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని చక్కబెట్టుకోవాలి. తర్వాత ప్రజలకు మరింత గొప్పగా ఏ విధంగా సేవ చేయాలని నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. నా ఆలోచనలను నిజం చేయడానికి సహకరించే అందరు వ్యక్తులతో నేను కలుస్తాను. వారందరి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు సాగుతాను.