Hyderabad Rains: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలపై చెట్లు కూలడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయ ఏర్పడిందని దక్షిణ డిస్కం సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. ఈ రోజు తెల్లవారుజామున నగరంలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం, ఈదురు గాలుల నేపథ్యంలో దక్షిణ డిస్కం పరిధిలోని విద్యుత్ అధికారులతో రఘుమారెడ్డి ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. నగరంలో విద్యుత్ సరఫరా పరిస్థితిని పర్యవేక్షించారు.
‘‘విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది చెట్లను తొలగించి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల్లో ఉన్నారు. చెట్ల మీద, వాహనాల మీద విద్యుత్ వైర్లు పడితే వాటిని తాకే ప్రయత్నం చేయొద్దు. రోడ్ల మీద నిల్వ ఉన్న నీళ్లలో విద్యుత్ వైర్లు గాని, ఇతర విద్యుత్ పరికరాలు మునిగి ఉన్నట్లయితే ఆ నీటిలోకి పోరాదు. విద్యుత్ సరఫరా సమస్యల పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉన్నా 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ నెంబర్లు 73820 72104, 73820 72106, 73820 71574లకు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు’’ అని రఘుమారెడ్డి తెలిపారు.