Special Awareness Conference on Cyber Crimes : సైబర్ భద్రత, సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి మహముద్ అలీ అన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. డబ్బుపై దురాశతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని ప్రముఖ సినీ దర్శకులు రాజమౌళి పేర్కొన్నారు. 80 శాతం నేరాలు ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల జరుగుతున్నాయన్న ఆయన... సైబర్ నేరగాళ్లు అమాయకులను రకరకాలుగా బురిడీ కొట్టిస్తున్నారన్నారు.
'మా షూటింగ్ సెట్టింగ్‌లో ఉన్న ఓ వ్యక్తికి సైతం సైబర్ కాల్ వచ్చింది. బ్యాంక్ మేనేజర్ అని చెప్పడంతో ఓటీపీ చెప్పాడు. 10 నెలల వేతనం అతని బ్యాంక్ ఖాతా నుంచి కొట్టేశారు. డబ్బుపై దురాశతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కష్టపడి సంపాదించే డబ్బుతో వచ్చే ఆనందం వేరు. ఈజీగా వచ్చే డబ్బు మోసానికి దారితీస్తుంది. మన పిల్లలకు చిన్నప్పటి నుంచే కష్టం అంటే ఎంటో నేర్పించాలి. సైబర్ నేరాలపై తెలుగులో ప్రజలకు అవగాహన కలిగేలా విస్తృత ప్రచారం చేయాలి.'-రాజమౌళి, సినీ దర్శకుడు
ప్రత్యక్ష యుద్ధాలు పోయి సైబర్ యుద్ధం నడుస్తోంది :అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్.. హద్దులు లేని స్నేహాలతో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. ప్రస్తుత రోజుల్లో ప్రత్యక్ష యుద్ధాలు పోయి సైబర్ యుద్ధం నడుస్తోందని సీవీ ఆనంద్ అన్నారు. నిందితులు ఎక్కడో ఉండి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. అయితే తెలియని వారితో సమస్యలు పంచుకుని వ్యక్తిగత ఫొటోలు పంపిస్తున్నారన్న సీపీ... సమాజంలో ప్రస్తుతం 18 రకాల సైబర్ నేరాలు జరుగుతున్నట్లు గుర్తించినట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్ నగర పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాలకు ఐటీ నిపుణులు, సంస్థలు సహకరించాలని సీపీ కోరారు.
'సెల్ఫోన్లు జీవితంలో భాగమైపోయాయి. హద్దులు లేని స్నేహాలతో కొన్నిసార్లు ఇబ్బందులు. పూర్తిగా తెలియని వాళ్లకు వ్యక్తిగత ఫొటోలు పంపిస్తున్నారు. 18 రకాల సైబర్ నేరాలు జరుగుతున్నట్లు గుర్తించాం. రుణాల పేరుతో జరిగే మోసాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రత్యక్ష యుద్ధాలు పోయి సైబర్ యుద్ధం నడుస్తోంది. మహేశ్ బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్ నైజీరియా నుంచి జరిగింది. సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తలు ఎంతో అవసరం.'- సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ
ఇవీ చదవండి :