మహారాష్ట్ర రక్తం పంచుకున్నా, కర్ణాటక పాలు తాగినా, మడికొండ గాలి పీల్చినా- కాళోజీ మనిషిని ప్రేమించారు. మనిషి బతుకును ప్రమాణంగా భావించారు. కవిత్వం నిండా బతుకుతత్వాన్ని వినిపించారు. తెలంగాణ బతుకమ్మ నుంచి స్ఫూర్తి పొందినా, ఆల్బర్ట్ ష్విట్జర్ ‘రెవెరెన్స్ ఆఫ్ లైఫ్’ నుంచి ప్రేరణ పొందినా జీవితాన్ని కాళోజీ సిద్ధాంతీకరించారు. ‘బతుకే భగవంతుడు. ఇచ్ఛయే ఈశ్వరుడు’ అని విశ్వసించారు. ‘బతుకుకు సాటి బతుకు. బతుకుకు కావలసింది బతుకు. బతుకు బతుకుతుంది బతుక్కోసం’ అనేది ఆయన వాదం. బతుకు సూత్రాన్ని అంత సులభంగా నిర్వచించిన కవి మరొకరు లేరు. ‘సాగిపోవుటె బతుకు. ఆగిపోవుటె చావు’ అన్నారు. అంతేకాదు. బతకాలంటే ‘తొలగితొవెవడిచ్చు... తోసుకొని పోవలయు’ అని వివరించారు. బతుకు ఒక పోరాటమని సూత్రీకరించారు.
కాళోజీ గొప్ప మానవవాది. మనిషిని మించిన మరోశక్తిని ఊహకైనా ఇష్టపడలేదు. యుద్ధాలు, ఉద్యమాలు, మతాలు, రాజకీయాలు, అక్షరాలు... ఏవైనా మనిషి కోసమేనని ఆయన భావించారు. మంచి చెడ్డలను ఎంచి చూసిన గురజాడ లాగే మనిషిలోని మంచి చెడులను సున్నితంగా కవిత్వీకరించారు. ‘మనిషి ఎంత మంచివాడు- చనిపోయిన వాని చెడును వెనువెంటనే మరుస్తాడు. కాని మంచినె తలుస్తాడు’ అని మనిషి మంచితనాన్ని ఆవిష్కరించారు. అంతలోనే ‘మనిషి ఎంత చెడ్డవాడు- బతికి ఉన్నవాని మంచిని గుర్తించడు. కాని వాని చెడును వెతికి కెలుకుతాడు’ అంటూ మరో కోణాన్ని వివరిస్తారు. అయినా- మనిషంటేనే కాళోజీకి ఇష్టం. ‘మనిషి బతుకు బతుకుతాను, నా మనసుకు నచ్చినట్టు మాట్లాడతా. రాస్తా. ప్రకటిస్తా’ అన్నారు. మనుషుల భావోద్వేగాలను అక్షరాల్లోకి వొంపారు. కాళోజీకి ఆర్ద్రత ఎక్కువ. అందువల్ల ఆవేశమూ ఎక్కువే. ‘పరుల కష్టము జూచి పగిలిపోవును గుండె- మాయమోసము జూచి మండిపోవును ఒళ్లు. అవనిపై జరిగేటి అవకతవకలు జూచి ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు’ అనుకొన్నారు. హృదయం కరిగినప్పుడే కదా కవి అయ్యేది. కన్నీరయ్యేది. కాళోజీ తన చుట్టూ ఆర్ద్ర దృశ్యాలు చూసి కరిగిపోయారు. ఎడతెగకుండా సాగుతున్న అన్యాయాలను చూసి ప్రశ్నించారు. నిజాం ప్రభువైనా సరే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రయినా సరే, భారతదేశం రాష్ట్రపతైనా సరే- మంద్రస్వరంతో హెచ్చరించారు. నియంతృత్వాన్ని ధిక్కరించారు. ప్రజలకోసం, సమ సమాజంకోసం అక్షరాలు ఎక్కుపెట్టారు.