ganesh chaturthi 2022 కుతూహలం ఉండాల్సిందే: ఏ విద్యార్థైనా సరే కొత్త విషయాల పట్ల ఆసక్తిని పెంచుకోవాలి. కుతూహలాన్ని ప్రదర్శించాలి. లేకపోతే... వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉండదు కదా! అదే నిరూపిస్తుంది గణేశుని జీవితంలోని ఈ ఘటన. వర్షాల్లేక విపరీతమైన కరవుకాటకాలతో తల్లడిల్లుతున్న నేలని తడపడానికని అగస్త్య మహాముని శివుని దగ్గరున్న గంగాజలాన్ని తీసుకుని తన కమండలంలో నింపుకొని బయలుదేరాడు. విశ్రాంతి తీసుకుందామని ఓ చోట నడుంవాల్చాడు. ఇంతలో ఆ కమండలంలో ఏముందో తెలుసుకుందామనుకున్న గణేశుడు కుతూహలం కొద్దీ కాకి రూపంలోకి మారి దానిపై వాలాడు. ఆ బరువుకి కమండలంలోని నీళ్లు ఒలికి... కావేరీ నదిగా మారి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశాయి. గణేశునిలోని ఆసక్తీ, కుతూహలమే కదా ఇందుకు కారణం.
అనుకున్నది అయ్యేవరకూ: వేగంగా రాయడం వినాయకుని ప్రత్యేకత. మహాభారతాన్ని వ్యాసుడు చెబుతూ ఉంటే... ఎక్కడా ఆపకుండా రాస్తానని వ్యాసునికి మాటిచ్చాడు లంబోదరుడు. కానీ మధ్యలో అతని కలం మొరాయించింది. ఆ సమయంలో విఘ్నం కలగకూడదని తన దంతాన్ని విరగ్గొట్టి దాంతోనే రాసి ఆ పనిని పూర్తిచేశాడు. చేపట్టిన పనిని పూర్తిచేయడానికి త్యాగం, సాహసం అవసరమని ఈ కథ చెబుతోంది.
నిండుకుండ నిబ్బరంగా: మహా ధనవంతుడైన కుబేరుడు శ్మశానంలో ఉండే శివునికి తన దర్పాన్ని, సంపదలని చూపించి మురిసిపోవాలని అనుకున్నాడు. అందుకు తన ఇంటికి ఆహ్వానం పలికాడు. శివుడు తనకు వీలుపడదని, కొడుకు గణేశుణ్ని పంపాడు. గణేశుడికి కుబేరుడి అంతరంగం అర్థమైంది. అయినా వినయంగానే ఉన్నాడు. కుబేరుడు ఆడంబరంగా వడ్డిస్తుంటే... పెట్టినవి పెట్టినట్టు తినేశాడు లంబోదరుడు. కుబేరుని దగ్గర ఇక ఏమీ మిగల్లేదట. అప్పుడతనికి గర్వభంగం అయ్యింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ సంయమనాన్ని కోల్పోకూడనేది ఇక్కడ గణపయ్య నేర్పే పాఠం.