చలి పంజా: నెహ్రూ జూపార్కులో మూగజీవాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు రోజురోజుకూ పెరుగుతున్న చలితో జనం వణికిపోతున్నారు. చల్ల గాలులు, మంచు ప్రభావాన్ని భరించలేక అల్లాడుతున్నారు. ఈ చలికి జంతువులూ మినహాయింపేమీ కాదు. హైదరాబాద్ నెహ్రూ జంతుప్రదర్శనశాలలో మూగజీవాల సంరక్షణ కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చలి ప్రభావం నుంచి తట్టుకునేలా ప్రతి ఎన్‌క్లోజర్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ప్రత్యేక ఏర్పాట్లు
చల్లగాలులు ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లకుండా కిటికీలకు గన్ని బ్యాగులు కట్టారు. జంతువులకు వెచ్చదనం కలిగించేందుకు హీటర్లు, యూవీలైట్లు ఏర్పాటు చేశారు. పక్షుల కోసం వెదురు బుట్టలు, కుండలు పెట్టారు. ఎన్‌క్లోజర్‌లోని కింది భాగంలోని గచ్చు చల్లగా ఉంటుందని... వెచ్చదనం కలిగించేలా చెక్కలు, ఎండుగడ్డిని ఏర్పాటు చేశారు.
ఆహారంలోను మార్పులు
శీతకాలాన్ని దృష్టిలో పెట్టుకుని జంతువుల సంరక్షణకు సంబంధించి సిబ్బందికి పలు సూచనలు ఇస్తున్నారు. చల్లదనం కారణంగా వాటికి అందించే ఆహారం, పానియాలలోనూ మార్పులు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. చలిగాలుల వల్ల జంతువులకు పలు సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు.
యువ జంతువులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని.... న్యూమోనియా వంటి వ్యాధులు సోకుతాయని పేర్కొన్నారు. ఇలాంటివి తలెత్తకుండా ఉండేందుకు వెచ్చదనంతోపాటు ఆహారం, పానియాల్లో బీ కాంప్లెక్స్ ఇస్తున్నట్లు తెలిపారు. చలికాలం ముగిసే వరకు జంతువుల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉంటామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:ఘనంగా సింగరేణి ఆవిర్భావ వేడుకలు