బ్లాక్‌ఫంగస్ బాధితులకోసం సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో.. 200 పడకలతో పాటు.. ఆపరేషన్లకు 5 థియేటర్లను సిద్ధం చేశారు. దాదాపు 25 ఏళ్లుగా కంటి వైద్యంలో పేరొందిన ఈ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి.రాజలింగం నేతృత్వంలో ఫంగస్ రోగులకు శస్త్ర చికిత్సలు చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 25 వేల సాధారణ కంటి ఆపరేషన్లు చేసిన రాజలింగం బ్లాక్ ఫంగస్‌పై పరిశోధన కూడా చేస్తున్నారు. ఈటీవీ భారత్‌కి ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో ఆయన రోగులకు తాము అందించే సేవల గురించి వివరించారు. రూపాయి ఖర్చు కాకుండా ఉచిత వైద్యం చేసి క్షేమంగా ఇంటికి పంపిస్తామని హామీ ఇస్తున్నారు.
బ్లాక్ ఫంగస్ బాధితులకు పూర్తి స్థాయి చికిత్స అందించేందుకు ఆసుపత్రి సిద్ధంగా ఉందా?
మా ఆసుపత్రిలో 550 పడకలున్నాయి. మొదటిదశ కింద ఫంగస్ రోగుల కోసం 200 పడకలు కేటాయించాం. కరోనా వల్ల సాధారణ కంటి రోగులు పెద్దగా రావడం లేదు. ప్రస్తుతం 50 పడకల్లోనే ఉన్నారు. ప్రభుత్వం ఆదేశిస్తే మొత్తం ఆసుపత్రిని ఫంగస్ రోగుల చికిత్స కోసం ప్రత్యేక ఆసుపత్రిగా మార్చడానికి కూడా ఇబ్బంది లేదు. మా ఆసుపత్రిలో చేరితే ఒక్క రూపాయి ఖర్చు కాకుండా వైద్యం చేసి క్షేమంగా ఇంటికి పంపిస్తాం. ప్రతి రోగిని ఒక్కో వైద్యునికి దత్తత ఇచ్చి పూర్తిస్థాయి వైద్యం అందిస్తాం.
శస్త్రచికిత్సలకు డాక్టర్లు, నర్సింగ్, ఇతర సిబ్బంది తగినంతమంది ఉన్నారా?
పీజీలతో కలిపితే 152 మంది వైద్యులు ఉన్నారు. 72 మంది నర్సులు, సరిపడా సిబ్బంది ఉన్నారు. 150 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం ఉంది. 5 వెంటిలేటర్లు, 5 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. అవసరమైన రోగులకు ఆపరేషన్లు చేయడానికి ఇబ్బంది ఏమీ లేదు. ప్రస్తుతం మా ఆసుపత్రికి చెందిన ఏడుగురు కంటి వైద్యులు ఈఎన్‌టీ, గాంధీ ఆస్పత్రులకు వెళ్లి ఆపరేషన్లు చేస్తున్నారు. కొంతమంది ఈఎన్‌టీ వైద్యులను మాకు కేటాయించడానికి ఉన్నతాధికారులు అంగీకరించారు. మందులు, ఇంజక్షన్లు అందించనున్నారు. బుధవారం ఒక రోగి చేరారు.