వచ్చే నెల ఏడు నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా భౌతిక దూరం పాటించేలా శాసనసభ నిర్ణయించింది. ఈ మేరకు మరో 42 తాత్కాలిక సీట్లు ఏర్పాటు చేయాలని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిర్ణయించారు. ప్రస్తుతం ఇద్దరేసి సభ్యులు కూర్చునేలా 76 సీట్లు ఉండగా... వాటిల్లో ఒక్కొక్కరిని కూర్చోబెట్టి, మిగిలిన 42 మంది కోసం తాత్కాలికంగా సీట్లు ఏర్పాటు చేయాలని స్పీకర్ ఆదేశించారు.
ప్రతిరోజూ శానిటైజ్...
కొవిడ్ వైరస్ నివారణ చర్యల్లో భాగంగా శాసనసభ సమావేశాలు ముగిసే వరకు ప్రతిరోజూ శాసనసభ, మండలిని శానిటైజ్ చేయాలని తీర్మానించారు. కరోనా లక్షణాలున్న సభ్యులను, ఇతరులను గుర్తించే విధంగా శాసనసభ, మండలి, బయట, లోపల అధునాతన స్కానర్లను ఏర్పాటు చేయనున్నారు. సభ్యులు మాస్కులు పెట్టుకోకపోతే స్కానర్ సైరన్ మోగిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేస్తుంది. శానిటైజ్ చేస్తుంది. ప్రతి ప్రవేశ ద్వారం వద్ద దీనిని అమర్చనున్నట్లు సభాపతి పోచారం తెలిపారు.