బడ్జెట్ సమావేశాలకు ఎలాంటి అవాంతరాలు రాకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. సోమవారం నుంచి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ, పోలీసు ఉన్నతాధికారులతో సభాపతి సమావేశమయ్యారు. శాసనసభ, మండలి నిర్వహణ, శాంతిభద్రతలు, కరోనా నివారణా చర్యలు, సంబంధిత అంశాలపై అధికారులతో చర్చించారు. సమావేశాలకు అందరూ సహకరించాలని కోరిన పోచారం... సభ్యులు స్వేచ్ఛగా పాల్గొనేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పారు.
విధిగా మాస్క్ ధరించాలి
పెండింగ్‌లో ఉన్న ప్రశ్నలకు త్వరగా సమాధానాలు పంపాలని చెప్పారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా నిబంధనలను కొనసాగిస్తున్నట్లు సభాపతి తెలిపారు. అసెంబ్లీ సమావేశ మందిరం, పరిసరాల్లో రోజుకు రెండుసార్లు శానిటైజేషన్ చేస్తారని చెప్పారు. ప్రతి సభ్యుడు, సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు.