సంక్రాంతి సందర్భంగా పతంగులు ఎగురవేయాలనుకునే వారికి ఎస్పీడీసీఎల్ సంస్థ పలు సూచనలు చేస్తోంది. జాగ్రత్తలు పాటిస్తూ.. పతంగులు ఎగురవేసుకోవాలని పేర్కొంది. విద్యుత్ లైన్లు, నియంత్రికలకు దూరంగా.. బహిరంగ ప్రదేశాలు, మైదానాల్లో మాత్రమే పతంగులు ఎగురవేయాలని కోరుతోంది. పతంగులు, మాంజాలు విద్యుత్ తీగలపై పడి సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
పతంగులు ఎగురేస్తున్నారా..! ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. - సంక్రాంతికి గాలిపటాలు జాగ్రత్తలు
సంక్రాంతి సందర్భంగా పతంగులు ఎగురవేయడం ఆనవాయితీ... అయితే వాటిని సురక్షిత ప్రాంతాల్లో ఎగురవేయడం శ్రేయస్కరమని ఎస్పీడీసీఎల్ అధికారులు సూచిస్తున్నారు. పతంగుల మాంజాలు విద్యుత్ తీగలపైన, నియంత్రికలపై పడి ప్రమాదాలు... విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడవచ్చని సంస్థ ఛైర్మన్, ఎండీ జి.రఘుమా రెడ్డి తెలిపారు. పతంగులు ఎగురవేసేవారికి ఎస్పీడీసీఎల్ సంస్థ పలు సూచనలు చేస్తోంది.
పతంగులు ఎగురవేసేవారికి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఇవి తప్పనిసరి..
- కాటన్, నైలాన్‌తో చేసిన మాంజాలను మాత్రమే వాడాలి.
- మెటాలిక్ మాంజాల వల్ల విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ.
- పొడి వాతావరణంలో మాత్రమే పతంగులు ఎగురవేయాలి.
- పతంగులు, మాంజాలు.. విద్యుత్ లైన్లు, ఇతర విద్యుత్ పరికరాలపై పడినప్పుడు వాటిని వదిలేయాలి.
- తీగలపై పడిన పతంగులను లాగొద్దు.
- బాల్కనీ, గోడల మీద నుంచి పతంగులు ఎగురవేయద్దు.
- పతంగులు ఎగురవేసేటప్పుడు పిల్లలను కంటకనిపెడుతుండాలి.
- తెగి పడిన విద్యుత్ తీగలను తాకొద్దు.
- ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే విద్యుత్‌శాఖ అధికారులకు సమాచారం అందించాలి.
ఇదీ చూడండి:సంక్రాంతికి టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు