వేసవి కాలంలో గ్రేటర్ హైదరాబాద్, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని జిల్లాల్లో నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్లు, సూపెరింటెండెంట్ ఇంజినీర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్, సర్కిల్ అధికారులు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణను అధికారులతో చర్చించారు.
వేసవిలో ఏర్పడే అదనపు లోడ్లు తట్టుకునేందుకు 56 పవర్ ట్రాన్స్ఫార్మర్లు, 1725 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, 11 నూతన 33/11 కేవీ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని రఘుమారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా 33/11 కేవీ సబ్స్టేషన్ల నిర్వహణ, ట్రాన్స్ఫార్మర్ల లోడ్ బ్యాలెన్సింగ్ వంటి పనులు పూర్తి చేశామని అధికారులకు సీఎండీకి వివరించారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, 33 ఫీడర్ల పని తీరుపై నిరంతర పర్యవేక్షణ చేయాలని, సరఫరాలో అంతరాయాలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు క్షేత్ర స్థాయి సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సీఎండీ ఆదేశించారు.