Rains in Telangana Today : రుతుపవనాల రాకతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తీవ్రమైన ఎండలతో అల్లాడిన ప్రజలు వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో తెప్పరిల్లారు. భరించలేని ఉక్కపోతలో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు ఈ వానలు ఉపశమనం కల్పించాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నగరంలోని ప్రధాన రహదారులు, కాలనీల్లో రోడ్లపై వాన నీరు పొంగి పొర్లింది. ఒక్కసారిగా కురిసిన కుంభవృష్టితో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఒకవైపు గాలిదుమారం, మరోవైపు భారీ వర్షం కురవడంతో పాదచారులు మెట్రో పిల్లర్లను ఆశ్రయించారు. పనులు ముగించుకుని ఇళ్లకు వెళ్తున్న వారంతా జోరువానలో తడిసి ముద్దయ్యారు.
Rains in Hyderabad : రాత్రి ఒంటిగంట వరకూ హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్‌లో 8.1 సెంటీమీటర్లు, రాజేంద్రనగర్‌లో 1.9, చాంద్రాయణగుట్ట ప్రాంతంలో 1.3 సెంటీమిటర్ల చొప్పున వర్షపాతం నమోదయ్యింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌తోపాటు పరిసర గ్రామాల్లోనూ వర్షం కురిసింది. కూకట్‌పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్‌కాలనీ, కెపీహెచ్‌బీ కాలనీ, నిజాంపేట్, బాచుపల్లి ప్రాంతాల్లో వర్షం ఓ మోస్తరుగా పడింది. కుత్బుల్లాపూర్, సూరారం, కొంపల్లి, జీడిమెట్లలో భారీ వర్షం పడింది. హైదరాబాద్ పరిధిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ముందుగానే హెచ్చరించడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తం అయ్యింది. డీఆర్‌ఎఫ్ బృందాలు, జీహెచ్‌ఎంసీ అధికారులు వరద సహాయకచర్యల్లో పాల్గొన్నారు. యాదాద్రిలోనూ జోరుగా వర్షం కురిసింది. ఏకబిగిన కురిసిన వానలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చూపరులను ఆకట్టుకుంది. ఆలయం ప్రాంగణంలోని నల్లరాతి కృష్ణశిలలు, రాజగోపురాలపై నుంచి కిందకు జారిన వర్షపు ధారలు... సందర్శకులకు కనువిందు చేశాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో మోస్తారు వర్షం కురిసింది.