Heavy Rains in Hyderabad : నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం నుంచే ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం.. గత రాత్రి అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడ్డాయి. ఇవాళ మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్లో భారీ వర్షం పడింది. దీంతో రహదారులు జలమయం కాగా.. వాహనదారులు ఇబ్బంది పడ్డారు. చాలా రోజులుగా ఎండ తీవ్రతతో ఇబ్బంది పడ్డ జంటనగర వాసులు నైరుతి పలకరించడంతో కాస్త కూల్ అయ్యారు.
Southwest Monsoon IMD report : నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గురువారం ఖమ్మంలోకి ప్రవేశించిన రుతుపవనాలు నిజామాబాద్ వరకు విస్తరించినట్లు తెలిపింది. రాగల 1-2 రోజుల్లో తెలంగాణ అంతటా విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతం పరిసరాలలోని ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గరలో సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కి.మి. వరకు కొనసాగుతూ ఎత్తుకి వెళ్లే కొలది నైరుతి దిశగా కొనసాగుతుందని వెల్లడించింది.
- Hyderabad Rains : తొలికరి చినుకులతో పులకరించిన భాగ్యనగరం.. పలు ప్రాంతాల్లో వర్షాలు
- వర్షాలు వచ్చేశాయ్... కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు
రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈరోజు భారీ వర్షాలు, ఉత్తర తెలంగాణ జిల్లాలు, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది.