లాక్‌డౌన్ కాలాన్ని ద.మ.రైల్వే పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. ఈ సమయంలో పట్టాల నిర్వహణ పనులు కొనసాగించింది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో 6,336 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గాలున్నాయి. 754 రైల్వేస్టేషన్లలో ప్రతిరోజూ సుమారు 750 ప్రయాణికుల రైళ్లు, 300ల గూడ్స్ రైళ్లు వీటి పరిధిలో నడుస్తుంటాయి.
లాక్‌డౌన్ సమయంలో రైలు పట్టాలు, కేంద్రాలు, క్రాసింగ్‌లు, స్లీపర్ల పునరుద్ధరణ పనులు చేపట్టడం వల్ల పట్టాల భద్రతతో పాటు, రైళ్లు వేగంగా ప్రయాణించేలా చేయగలిగామని ద.మ. రైల్వే శాఖ సీపీఆర్‌వో సీహెచ్ రాకేశ్ తెలిపారు. మే 1 నుంచి 25వ తేదీ వరకు ఈ పనులు చేపట్టినట్లు వివరించిన ఆయన.. ఈ సమయంలో 984 కిలోమీటర్ల మేర రైలు మార్గాలను పునరుద్ధరించామన్నారు.