Special Trains for Sankranti : సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది. మచిలీపట్నం-కర్నూలు, మచిలీపట్నం-తిరుపతి, విజయవాడ-నాగర్‌సోల్, కాకినాడ-లింగంపల్లి, పూర్ణ-తిరుపతి, తిరుపతి-అకోలా, మచిలీపట్నం-సికింద్రాబాద్ రూట్లలో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. రానుపోను ఇరువైపులా కలిపి జనవరిలో మొత్తం 70 ట్రిప్పుల ప్రత్యేక రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే ద.మ.రైల్వే ప్రకటించిన తేదీలు, రూట్లను పరిశీలిస్తే ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా లేవు.
మొత్తం ఎనిమిది రూట్లలో ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తే.. అందులో మూడు రూట్లు ఏపీ నుంచి మహారాష్ట్రకు రాకపోకలు సాగించేవి ఉన్నాయి. కర్ణాటకలోని బెంగళూరు, తమిళనాడులోని చెన్నై నుంచి తెలుగు ప్రజలు సంక్రాంతికి పెద్దసంఖ్యలో వచ్చి వెళతారు. తాజా జాబితాలో చెన్నై, బెంగళూరుల నుంచి ఒక్క ప్రత్యేక రైలూ లేదు. హైదరాబాద్ నుంచి అత్యధిక రద్దీ ఉండే విశాఖపట్నం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఒక్క సంక్రాంతి ప్రత్యేక రైలునూ ప్రకటించలేదు.
ఉమ్మడి ప్రకాశం..రాయలసీమ జిల్లాలకూ తాజా జాబితాలో లేవు. హైదరాబాద్ నుంచి ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలకు పెద్దసంఖ్యలో వెళతారు. జనసాధారణ్ రైళ్లు కావాలన్న డిమాండ్ ప్రయాణికుల నుంచి ఉన్నా వాటి ప్రస్తావన లేదు. ముంబయి, సూరత్ వంటి నగరాల నుంచి పెద్ద సంఖ్యలో తెలంగాణకు వస్తుంటారు. అటు వైపు ప్రత్యేక జాబితాలో ప్రస్తావనే లేదు.