Bharat Gaurav Trains : దక్షిణ మధ్య రైల్వేలోనూ ‘భారత్ గౌరవ్’ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి. భారతదేశ సాంస్కృతిక, వారసత్వ, ప్రముఖ చారిత్రాక ప్రదేశాలు, ముఖ్యమైన యాత్ర స్థలాల విశేషాలను దేశ ప్రజలకు, ప్రపంచానికి తెలియచేయాలనే లక్ష్యంతో భారత్ గౌరవ్ రైళ్లను ప్రవేశపెడుతోంది. యాత్ర స్థలాలు దక్షిణ మధ్య రైల్వే నెట్‌వర్క్ పరిధిలో చాలా ఉన్నాయని.. వాటిని భారత్ గౌరవ్ రైళ్లతో అనుసంధానిస్తే ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని రైల్వే శాఖ భావిస్తోంది.
కావాల్సిన విధంగా ఎంపిక..
south central railway news : ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వారికి కావాల్సిన విధంగా ఒక్కో రైలులో 14 నుంచి 20 కోచ్‌ల వరకు ఎంపిక చేసుకోవచ్చని ద.మ.రైల్వే గురువారం ప్రకటించింది. సికింద్రాబాద్ రైల్‌నిలయంలోని జోన్ ప్రధాన కార్యాలయంలో కస్టమర్ సపోర్ట్ యూనిట్‌ని ప్రారంభించింది. పర్యాటక సర్క్యూట్ రైళ్ల అవకాశాన్ని వినియోగించుకోవాలని జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా కోరారు.
కార్యాచరణ షురూ..
దేశంలో పర్యాటకరంగాన్ని ప్రోత్సహించడం పేరుతో రైల్వేశాఖ ‘భారత్ గౌరవ్’ రైళ్లను ప్రకటించగా... అందుకు అనుగుణంగా ద.మ.రైల్వే కార్యాచరణను ప్రారంభించింది. ఆపరేటర్ల ఎంపికను 10 పనిదినాల్లో ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. సాంస్కృతిక, వారసత్వ, చారిత్రక ప్రదేశాలు, ముఖ్యమైన యాత్రాస్థలాల విశేషాల్ని దేశప్రజలకు తెలపడం లక్ష్యమని రైల్వేశాఖ చెబుతోంది. కంపెనీల నుంచి, వ్యక్తిగతంగా, భాగస్వామ్య, వ్యాపార సంస్థలు ప్రత్యేక రైళ్లను ఎంపిక చేసుకుని నడిపించవచ్చని, ఈ రైలు సర్వీసుల్లో ఛార్జీలను నిర్ణయించుకునే, పర్యాటక మార్గాల్ని ఎంచుకునే వెసులుబాటునూ కల్పిస్తున్నట్లు ద.మ.రైల్వే వివరించింది.