రైళ్ల నిర్వహణలో కీలకమైన పాత్ర పోషిస్తున్న లోకో పైలట్లు, గార్డులు,రన్నింగ్ సిబ్బంది,విధుల్లో భాగంగా హెడ్ క్వార్టర్‌కు దూరంగా ఉండే సమయాన్ని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే ఆలోచన చేసి సరుకు రవాణా రైళ్లలో రౌండ్ ట్రిప్ విధానాన్ని ప్రవేశపెట్టింది.
రోజురోజుకు విస్తరిస్తున్న కొవిడ్-19ని కట్టడి చేయడానికి ఏప్రిల్ 14 వరకు అన్ని రకాల ప్రయాణికుల రైళ్లను రద్దు చేసినప్పటికీ... నిత్యావసర సరుకుల రవాణాను భారతీయ రైల్వే నిరంతరం కొనసాగిస్తుంది. ఈ సమయంలో రైల్వే సిబ్బంది, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్లు, టెక్నీషియన్లు, ఇంజనీర్లు, సెక్షన్ కంట్రోలర్లు, గ్యాంగ్ మెన్లు, గార్డులు, లోకో పైలట్లు సరుకు రవాణా రైళ్లను నడపడంలో కీలక భూమిక పోషిస్తున్నారు.
రన్నింగ్ స్టాఫ్‌కు ప్రయోజనం
సాధారణ పరిస్థితుల్లో రన్నింగ్ సిబ్బంది(లోకో పైలట్లు, గార్డులు) హెడ్ క్వార్టర్‌కు దూరంగా చాలా సమయం రన్నింగ్ రూముల్లో ఉండాల్సి వచ్చేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణికుల రైళ్లు రద్దయ్యాయి. ఫలితంగా గూడ్స్ రైళ్ల సగటు వేగం పెరిగినందున ప్రయాణ సమయం తగ్గింది. ఈ విధానంలో సాధ్యమైనంత వరకు రన్నింగ్ స్టాఫ్‌ని తక్కువ దూరాల ట్రిప్పులకు వినియోగిస్తున్నారు. ఔట్ గోయింగ్ ట్రిప్ డ్యూటీ పూర్తైన వెంటనే హెడ్ క్వార్టర్ వైపు వచ్చే రైళ్లకు వారిని పంపించేస్తున్నారు. దీనివల్ల ప్రధాన కార్యాలయానికి దూరంగా ఉండే సమయం తగ్గి త్వరగా హెడ్ క్వార్టర్స్‌కు చేరుకుంటున్నారు. ఈ విధానంతో 80శాతం రన్నింగ్ స్టాఫ్‌కు ప్రయోజనం కలుగుతుంది.