వేసవి దృష్ట్యా రైల్వే స్టేషన్లు, రైళ్లలో భద్రత చర్యలు మరింత పటిష్టం చేయాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా అధికారులకు సూచించారు. ముఖ్యంగా కార్యాలయ భవనాల వద్ద అగ్ని ప్రమాదాల నివారణకు తనిఖీలు చేపట్టాలన్నారు. పని ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే అనవసర సామగ్రిని స్క్రాప్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై జోన్ పరిధిలోని భద్రత, సరకు రవాణా, రైళ్ల రాకపోకల సమయపాలనపై సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం నుంచి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.
వేసవిలో భద్రత చర్యలు మరింత పటిష్టం: గజానన్ మాల్యా
వేసవి కాలంలో మరింత భద్రత కోసం ముందు జాగ్రత్త చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై జోన్ పరిధిలోని భద్రత, సరకు రవాణా, రైళ్ల రాకపోక సమయపాలనపై సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ముఖ్యమైన ప్రాంతాల్లో స్మోక్ డిటెక్టర్స్, ఫైర్ అలారం వంటి భద్రతా పరికరాలు తనిఖీలు, వాటి నిర్వహణ క్రమక్రమంగా చేపట్టాలన్నారు. అన్ని పరిసరాల్లో తప్పకుండా వాటర్ హైడ్రంట్స్, అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. వేసవి కాలంలో ప్రయాణికుల ఆరోగ్యానికి సంబంధించి రక్షిత చర్యలు చేపట్టాలని జీఎం అధికారులకు సూచించారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే సమయంలో క్షేత్రస్థాయిలో ముఖ్యంగా ట్రక్కు వద్ద పనిచేసే సిబ్బంది పనివేళల్లో మార్పు చేసి.. వారి భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమీక్షలో వివిధ విభాగాల ఉన్నతాధికారులు, విజయవాడ, గుంతకల్, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ విభాగాల డివిజినల్ రైల్వే మేనేజర్లు పాల్గొన్నారు.