కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం సాధారణ రైళ్లను దశలవారీగా నడిపిస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా పేర్కొన్నారు. ఇప్పటికే సబర్బన్ రైళ్లను సిద్దంగా ఉంచామని.. రైల్వే శాఖ నుంచి అనుమతులు రాగానే వాటిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. లాక్డౌన్ సమయంలో చేపట్టిన కార్యక్రమాలను దృశ్య మాధ్యమం ద్వారా రైల్ నిలయం నుంచి మాల్యా వివరించారు.
గమ్య స్థానాలకు
జూన్ 30 నాటికి దక్షిణ మధ్య రైల్వే 246 శ్రామిక్ ప్రత్యేక రైళ్ల ద్వారా 3,13,534 మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చామన్నారు. తెలంగాణలో 14 రైల్వే స్టేషన్ల నుంచి 151 రైళ్లను నడిపి 1,87,303 మంది ప్రయాణికులను చేరవేశామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 15 రైల్వే స్టేషన్ల నుంచి 74 రైళ్లను నడిపించి 89,971 మంది ప్రయాణికులు.. మహారాష్ట్రలో 3 రైల్వే స్టేషన్ల నుంచి 18 రైళ్లను నడిపించి 23,432 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు సురక్షితంగా పంపించామని చెప్పారు.
ప్రత్యేక శ్రామిక రైళ్లు
వీటితో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు ప్రత్యేక శ్రామిక రైళ్లను నడిపామని వివరాలు వెల్లడించారు. బీహార్‌కు 63 రైళ్ల ద్వారా 81,997 మందిని, ఒడిశాాకు 48 రైళ్ల ద్వారా 77,582 మందిని, ఉత్తరప్రదేశ్‌కు 51 రైళ్ల ద్వారా 61,517 మందిని, ఝార్ఖండ్‌కు 25 రైళ్ల ద్వారా 27,338 మందిని, బెంగాల్‌కు 14 రైళ్ల ద్వారా 20,156 మందిని, మధ్యప్రదేశ్‌కు 13 రైళ్లను నడిపి 13,216 మందిని, రాజస్థాన్‌కు 10 రైళ్లను నడిపి 9,847 మందిని, మణిపూర్‌కు 4 రైళ్లను నడిపించి 5,517 మందిని, చత్తీస్‌ఘడ్‌కు 4 రైళ్ల ద్వారా 4,949 మందిని, ఉత్తరాఖండ్‌కు ఒక రైలును నడిపించి 1,180 మందిని, మిజోరాంకు ఒక రైలును నడిపించి 1,143 మందిని, జమ్మూ కశ్మీర్‌కు ఒక రైలును నడిపి 983 మందిని, త్రిపురకు ఒక్క రైలును నడిపించి 975 మందిని, అసోంకు ఒక రైలును నడిపించి 968 మందిని సురక్షితంగా చేరవేశామన్నారు.