రైల్వే ఉద్యోగులు, పదవీ విరమణ పొందినవారు, కుటుంబ సభ్యులు కలిపి జోన్ పరిధిలో ఇప్పటివరకు 8,400 మంది కొవిడ్ బారిన పడ్డారు. ఇందులో ఉద్యోగుల సంఖ్య సగానికి పైగా ఉంటుందని సమాచారం. బాధితుల్లో 3 వేల మంది చికిత్సకోసం ఆసుపత్రుల్లో చేరారు. 5,400 మంది హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందారు. 300 మంది మరణించారు. విజయవాడ డివిజన్ పరిధిలో ఏప్రిల్ 1 నుంచి 60 మందికి పైగా టికెట్ తనిఖీ అధికారులు కొవిడ్ బారిన పడగా.. వారిలో 10 మంది మరణించినట్లు సమాచారం.
ఓపీ సేవలు బంద్
- సికింద్రాబాద్ లాలాగూడలోని ద.మ.రైల్వే సెంట్రల్ ఆసుపత్రిలో 300 పడకలు ఉండగా.. గత జూన్‌లో 100 బెడ్లను కొవిడ్ చికిత్సకు కేటాయించారు. ఏప్రిల్ నుంచి ఔట్‌పేషెంట్ సేవల్ని నిలిపివేసి.. కొవిడ్ పడకల సంఖ్యను క్రమంగా 250కి పెంచారు. మెట్టుగూడలో ‘రైల్‌కల్యాణ్’, మౌలాలి ఇరిసెట్ ప్రాంగణంలోని సూపర్‌వైజర్ల శిక్షణకేంద్రంలో 60 పడకలు ఏర్పాటుచేశారు. అయినా బెడ్ల కొరత వేధిస్తోంది. వ్యాధి తీవ్రంగా ఉన్నవారిని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. పలువురు సొంత ఖర్చుతో ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ చికిత్స పొందుతున్నారు.
- ఏపీలోని విజయవాడ రైల్వే ఆసుపత్రిలో ఉన్న 220 పడకలు కొవిడ్ రోగులతో నిండిపోయాయి. సాధారణ రోగులను వార్డుల నుంచి ఆసుపత్రి భవనంలోని కార్యాలయ గదులకు మార్చారు. ఇక్కడ దాదాపు 20 మందికిపైగా టీటీఈలు కొవిడ్ చికిత్స పొందుతున్నారు.
- గుంతకల్లు రైల్వే డివిజన్ ఆసుపత్రిలో 70 పడకలు ఉండగా 64 మంది కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నారు.
- వైద్యులపై ఒత్తిడి నేపథ్యంలో రైల్వే ఆసుపత్రుల్లో సేవలకు పారామెడికల్ సిబ్బందిని ఏడాది వ్యవధికి తాత్కాలికంగా తీసుకునేందుకు రైల్వే శాఖ నియామక ప్రక్రియ మొదలుపెట్టింది.