South central railway annual income increased : సికింద్రాబాద్.. దక్షిణ మధ్య రైల్వే చరిత్రలోనే మొదటిసారిగా ప్రయాణికుల ఆదాయంలో 5000 కోట్ల రూపాయాల ఆదాయాన్ని ఆర్జించి ఒక ప్రధాన మైలురాయిని సాధించింది. జోన్లో ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా 5,000.81 కోట్ల రూపాయాలు ఆర్జించింది. ఇది 2019-20లో నమోదైన ఉత్తమ ఆదాయము 4,119.44 కోట్ల రూపాయాల కంటే రూ. 881,37 కోట్లు అధికం. అనగా గత ఆదాయం కంటే 21% ఎక్కువ. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎక్కువ సర్వీసులు నడపడం, వివిధ విభాగాల మధ్య సిబ్బంది సమన్వయంతో పాటు సమష్టి కృషి వలన జోన్‌లోని ప్యాసింజర్ సెగ్మెంట్‌లో ఈ కొత్త మైలురాయిని చేరుకునేందుకు సాధ్యమైంది.
South Central Railway ఈ సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5,000 కోట్ల రూపాయాల ప్రయాణికుల ఆదాయాన్ని నమోదు చేసినందుకు దక్షిణ మధ్య రైల్వే సిబ్బందిని అభినందించారు. వివిధ శాఖల మధ్య పటిష్టమైన సమన్వయం అందుబాటులో ఉన్న వనరులను సమర్ధవంతంగా ఉపయోగించుకోవడం వల్ల మంచి ఫలితం లభించిందని ఆయన పేర్కొన్నారు.