తెలంగాణ

telangana

ETV Bharat / state

మన కొత్త గవర్నర్ తమిళిసై ప్రస్థానమిదీ... - నరసింహన్​ పాయే... సౌందర్య రాజన్​ వచ్చే!!

కేంద్రప్రభుత్వం 5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. మన రాష్ట్రానికి భాజపా మహిళా నేత తమిళిసై సౌందరరాజన్ గవర్నర్​గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకీ మన ఈ కొత్త గవర్నర్ ప్రస్థానమేంటంటే..!

మన కొత్త గవర్నర్.. తమిళిసై సౌందర రాజన్‌ ప్రస్థానమిదీ...

By

Published : Sep 1, 2019, 12:23 PM IST

Updated : Sep 1, 2019, 8:06 PM IST

మన కొత్త గవర్నర్.. తమిళిసై సౌందర రాజన్‌ ప్రస్థానమిదీ...

రాష్ట్రానికి కొత్త గవర్నర్‌ వచ్చారు. తమిళిసై సౌందరరాజన్‌ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా నియమిస్తూ.. కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. సౌందరరాజన్‌.... తమిళనాడు భాజపా రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ విధులు నిర్వహించారు.

తమిళిసై సౌందరరాజన్‌.... వృత్తిరీత్యా డాక్టర్‌. 1961 జూన్‌ 2న కన్యాకుమారి జిల్లాలో సౌందరరాజన్‌ జన్మించారు. మద్రాస్‌ మెడికల్‌ కాలేజీ చెన్నై నుంచి ఎంబీబీఎస్​ పట్టా అందుకున్నారు. రామచంద్ర మెడికల్‌ కళాశాలలో సహాయక ఆచార్యురాలిగా పనిచేశారు. మద్రాస్‌ మెడికల్‌ కాలేజీలో చదివేప్పుడు విద్యార్థి సంఘం నాయకురాలిగా ఎన్నికయ్యారు. తమిళిసై భర్త కూడా వైద్యుడే. భారత వైద్య పరిశోధనా మండలిలో పాలకమండలి సభ్యుడిగా ఉన్నారు.

తండ్రి కాంగ్రెస్... కుమార్తె భాజపా..

తండ్రి కుమారి ఆనందన్‌ ఎంపీగా పనిచేయడం వల్ల... బాల్యం నుంచే తమిళిసై సౌందరరాజన్‌కు రాజకీయాలపై ఆసక్తి నెలకొంది. తండ్రి కాంగ్రెస్‌లో పనిచేసినప్పటికీ.... సౌందరరాజన్‌ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి సమయంలో భాజపా వైపు ఆకర్షితురాలయ్యారు. తమిళనాడు భాజపా శాఖలో వివిధ విభాగాల్లో పనిచేశారు. సవాళ్లకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే తమిళిసై సౌందరరాజన్‌ 2006, 2011, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో, 2009, 2014, 2019 పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. ట్యూటికొరిన్ నియోజకవర్గంలో డీఎంకే మాజీ అధ్యక్షుడు కరుణానిధి కుమార్తె కనిమోళిపై పోటీ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. భాజపాలో క్రమశిక్షణ కలిగిన నేతగా ఉండటం ఆమెకు కలిసొచ్చింది.

వివిధ హోదాల్లో బాధ్యతలు..

తమిళిసై 1999లో దక్షిణ చైన్నై జిల్లా వైద్య విభాగం కార్యదర్శిగా, 2001లో రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శిగా, 2005లో ఆల్ ఇండియా కో-కన్వీనర్ (మెడికల్ వింగ్ ఫర్ సదరన్ స్టేట్స్)గా, 2007లో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2010లో రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, 2013లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం తమిళనాడు భాజపా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమెను కేంద్రం తెలంగాణ గవర్నర్​గా నియమించింది. రాష్ట్ర తొలి మహిళ గవర్నర్​గా ఖ్యాతిగడించారు.

Last Updated : Sep 1, 2019, 8:06 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details