Sonia Gandhi Telangana Lok Sabha Elections 2024 :తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఆ పార్టీ అగ్ర నేత సోనియాగాంధీ(Sonia Gandhi)ని ఈ రాష్ట్రం నుంచి పోటీ చేయాలంటూ రెండు మార్లు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఒకసారి, పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో రెండుసార్లు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఆ తీర్మానాలను అధిష్ఠానానికి పంపింది. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేయాలని స్వయంగా విజ్ఞప్తి చేయడంతో సుముఖత వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే తెలంగాణలో మూడు పార్లమెంటు నియోజకవర్గాల్లో సోనియాగాంధీ పోటీకి అనుకూల పరిస్థితులు ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అందులో ఖమ్మం పార్లమెంటు నియోజక వర్గం ఒకటి. ఇందులోని కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం మినహా ఆరు శాసనసభ నియోజకవర్గాలను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ఇక్కడ మధిర నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఖమ్మం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఆ నియోజకవర్గంలో ఉన్నారు. దీంతో అక్కడి నుంచి సోనియా గాంధీ పోటీ చేసినట్లయితే గెలుపు సునాయాసం అవుతుందని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ ముగ్గురు కూడా ఉప ముఖ్యమంత్రి, మంత్రులు కావడంతో పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు, ఎక్కువ ఓట్ల మెజారిటీతో సోనియాగాంధీ గెలుపునకు అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
టార్గెట్ 2024 - పక్కా ప్రణాళికతో పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్
Telangana Congress : రెండోది నల్గొండ పార్లమెంటు నియోజక వర్గం. ఇక్కడ సూర్యాపేట మినహా మిగిలిన ఆరు అసెంబ్లీ నియోజక వర్గాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక్కడ నల్గొండ అసెంబ్లీ నుంచి స్టార్ క్యాంపెయినర్, మాజీ ఎంపీ, రహదారులు, భవనాలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అదేవిధంగా హుజూర్‌నగర్ శాసనసభ నుంచి మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరిద్దరు కూడా బలమైన నాయకులు కావడం, మంత్రులుగా ఉండడంతో నల్గొండ నుంచి సోనియాగాంధీని బరిలోకి దించినట్లయితే విజయం సాదించేందుకు అవకాశం ఉందని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.