తెలంగాణరాజధానిని కరోనా రెండో దశ ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రభుత్వ రంగంలో అయిదు ఆస్పత్రులు, ప్రైవేటు రంగంలో రెండు వేల చిన్నా పెద్దా వైద్యశాలలు కొవిడ్ చికిత్సలో కీలక పాత్ర పోషించాయి. భాగ్యనగరం మెడికల్ హబ్‌గా మారడంతో రాష్ట్రవ్యాప్తంగానూ, పక్క రాష్ట్రాల నుంచి బాధితులు వెల్లువలా వచ్చారు. వేలాది మంది తరలివస్తుండడంతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడాయి. ఒకరా.. ఇద్దరా.. ఏకంగా పది వేల మంది వైద్యులు.. అంతే సంఖ్యలో నర్సులు.. వైద్య సిబ్బంది మూడు నెలలపాటు అహోరాత్రులు పని చేశారు. కుటుంబీకులు కరోనా బారిన పడినా, బంధువులు మరణించినా.. బాధను దిగమింగారే కానీ విధులపై ప్రభావం పడనివ్వలేదు. లక్షలాది మంది కరోనా, బ్లాక్ ఫంగస్ బాధితులను కంటికి రెప్పలా కాపాడారు. మృత్యువుకు దగ్గరైన వారికి ధైర్యం నూరిపోసి ప్రాణాలు నిలబెట్టారు. కొవిడ్, బ్లాక్ ఫంగస్ తగ్గుముఖం పట్టిన వేళ నగర వైద్య విభాగం ఊపిరి పీల్చుకుంటోంది. కొద్ది రోజులైనా విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారు.
‘గాంధీ’ వైద్య సేవలు అమూల్యం:
1850 పడకలున్న ఈ పెద్దాసుపత్రిలో వైద్య కళాశాల డాక్టర్లు, పీజీలు కలిపి వెయ్యి మంది వైద్యులున్నారు. అంతేస్థాయిలో నర్సులు, ఇతర సిబ్బంది పనిచేస్తున్నారు. మొదటి దశలో దాదాపు అయిదారు నెలలు ఈ ఆస్పత్రి కీలక పాత్ర పోషించింది. రెండో దశలో ప్రాణనష్టం ఎక్కువగా ఉండడంతో అందరూ 24 గంటలపాటు పని చేశారు. దాదాపు 60 వేల మంది బాధితులను పూర్తి ఆరోగ్యంతో ఇళ్లకు పంపారు. మూడు నెలలపాటు సెలవులు తీసుకోలేదు.
టిమ్స్, కింగ్‌కోఠి, ఛాతీ, ఫీవర్ ఆస్పత్రులు:
గత ఏడాది పురుడు పోసుకున్న గచ్చిబౌలి టిమ్స్‌లో వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది అవసరమైనంత మంది లేరు. ఉన్నవారే వేలాదిమంది బాధితులకు నయం చేయగలిగారు. మిగతా మూడు ప్రభుత్వ దవాఖానాల్లోనూ వైద్యులు, సిబ్బంది నిద్రాహారాలు మాని పని చేశారు.
ప్రైవేటు ఆస్పత్రులు:
ఇక్కడి వైద్యులు రోగులకు పూర్తిస్థాయిలో సేవలందించారు. బిల్లుల విషయంలో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలపై పలు ఆరోపణలు వచ్చిన విషయం విదితమే. కానీ అక్కడ పనిచేసిన వైద్యులు, వైద్యసిబ్బంది రోగులను కంటికి రెప్పలా కాపాడి వేలాది మందికి ఊపిరులూదారు. కంటిపై కునుకులేకుండా పని చేశారు.