తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆన్‌లైన్‌ బోధన..రుసుముల వడ్డన..! - ఆన్‌లైన్‌ తరగతులు

భాగ్యనగరంలోని పలు ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాయి. తల్లిదండ్రులను వేధిస్తున్నాయి. సెలవుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఆన్‌లైన్‌లో బోధన సాగిస్తూ ఇష్టారాజ్యంగా ట్యూషన్‌ ఫీజులు పెంచుతున్నాయి. గతేడాది పోల్చితే 8 నుంచి 28శాతం మేర పెంచి వసూలు చేసేందుకు నిర్ణయించాయి.

Hyderabad school fees latest news
Hyderabad school fees latest news

By

Published : May 9, 2020, 9:47 AM IST

లాక్‌డౌన్‌ కారణంగా తల్లిదండ్రులపై భారం పడకూడదన్న ఉద్దేశంతో గత విద్యాసంవత్సరంలో ఫీజులే వసూలు చేయాలని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను ప్రభుత్వం ఆదేశించింది. గత నెల 21న జీవో నం.46ను తీసుకువచ్చింది. దీని ప్రకారం 2020-21 సంవత్సరానికి ట్యూషన్‌ ఫీజు పెంచకూడదు. అవి కూడా నెలవారీ కట్టించుకోవాలి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇప్పటికే పలు ప్రైవేటు పాఠశాలలు గతేడాది ఫీజులను తిరిగి వసూలు చేస్తున్నట్లు ప్రకటించాయి.

కెన్నడీ గ్లోబల్‌ స్కూల్‌, ఫినిక్స్‌ గ్రీన్‌, మంథన్‌, గ్లెండెల్‌ యాజమాన్యాలు ఫీజులు పెంచడం లేదని తల్లిదండ్రులకు వర్తమానం పంపాయి. ఇప్పటికే ఫీజు కట్టి ఉంటే సర్దుబాటు చేస్తామని తెలిపాయి. ఇదే సమయంలో కొన్ని పాఠశాల యాజమాన్యాలు మాత్రం పెంచిన ఫీజులు కట్టాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. ఈ వ్యవహారంపై హైదరాబాద్‌ స్కూల్స్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ ఇప్పటికే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది.

  • హిమాయత్‌నగర్‌లోని ఓ పాఠశాల ఫీజు వసూలుకు కొత్త ఎత్తుగడ వేసింది. విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతుల నిర్వహణకు తెరలేపింది. వేసవి సెలవుల కారణంగా పాఠాలు చెప్పడం సరికాదని తల్లిదండ్రులు చెబుతున్నా వినకుండా తరగతులను నిర్వహిస్తోంది. పాఠాలు చెబుతూనే వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజులు చెల్లించాలని తల్లిదండ్రులకు సంక్షిప్త సందేశాలు పంపుతోంది. లాక్‌డౌన్‌ సమయంలో ఫీజులు ఎలా చెల్లించాలని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.
  • హైటెక్‌సిటీ ప్రాంతంలోని ఓ ఇంటర్నేషనల్‌ పాఠశాల. వచ్చే సంవత్సరానికి సంబంధించి ఫీజు చెల్లింపుపై ఇటీవల తల్లిదండ్రులకు ఈమెయిల్‌ పంపింది. దీని ప్రకారం 6వ తరగతి నుంచి 7వ తరగతిలో ప్రవేశించిన విద్యార్థికి గతేడాది పోల్చితే 27.52శాతం ఫీజు పెరిగింది. 3వ తరగతి నుంచి నాలుగో తరగతిలో ప్రవేశించిన విద్యార్థికి 17.8శాతం ఫీజును పెంచింది. అన్ని తరగతుల విద్యార్థులకు ట్యూషన్‌ ఫీజును పెంచుతూ తల్లిదండ్రులకు మెయిల్‌ చేసింది.

ఫీజులు కట్టాలని ఒత్తిడి...

పాఠశాలలకు ఏప్రిల్‌ నెలాఖరు నుంచి వేసవి సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. అప్పటికే లాక్‌డౌన్‌ అమల్లో ఉండటంతో విద్యాసంస్థలు బంద్‌ అయ్యాయి. వేసవి సెలవుల్లో ఎలాంటి బోధన సాగించేందుకు వీలుండదు. ఈ విషయాన్ని పట్టించుకోకుండా పలు ప్రైవేటు పాఠశాలలు ప్రాథమిక తరగతుల చిన్నారులకు సైతం ఆన్‌లైన్‌లో బోధిస్తూ భారం మోపుతున్నాయి.

పాత విద్యాసంవత్సరం ముగిసినా.. కొత్తది ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితిలో యాప్‌లు, వెబ్‌లింకుల సాయంతో పాఠాలు బోధిస్తున్నాయి. సెలవుల్లోనూ బోధన ఏంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి పుస్తకాలు లేకపోయినా తమకు తోచినట్లు బోధన చేస్తూ ఫీజులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని వాపోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details