కరోనా వైరస్ నియంత్రణలో పోలీసులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి వాహనదారులు బయటికి రాకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. వాహనదారుల ధ్రువపత్రాలను పరిశీలించి, నిబంధనలు అతిక్రమించిన వారిపై జరిమానాలు విధించారు. అకారణంగా బయటికి వచ్చిన వాళ్ల వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మార్చి 22న మొదలైన పోలీసుల లాక్డౌన్ విధులు నిర్విరామంగా కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే కరోనా వైరస్ లక్షణాలు బయటపడిన వ్యక్తులను దగ్గరుండి మరీ అంబులెన్స్‌లో ఆస్పత్రికి పంపిస్తున్నారు. సొంతూళ్లకు వెళ్లాలనుకునే వలస కూలీల నమోదుతో పాటు, దగ్గరుండి రైళ్లలో పంపిస్తున్నారు. ఇలా లాక్‌డౌన్‌కు సంబంధించిన ప్రతి అంశంలోనూ పోలుసులు కీలక విధులు నిర్వర్తిస్తున్నారు.
కరోనాతో కానిస్టేబుల్ మృతి...
కొవిడ్-19 నియంత్రణలో కీలక భూమిక పోషిస్తున్న పోలీసుల్లో కొంత మంది కరోనా బారిన పడుతున్నారు. తనిఖీ కేంద్రాల వద్ద ఉన్న సందర్భంగా ప్రతీ ఒక్కరినీ తనిఖీ చేయాల్సి వస్తోంది. వీరిలో కరోనా లక్షణాలున్న వాహనదారులు కూడా ఉండొచ్చు. ఉన్నతాధికారులు సూచించిన జాగ్రత్తలు తీసుకుంటూ విధుల్లో పాల్గొంటున్నప్పటికీ... కొంతమంది పోలీసులకి కరోనా సోకింది. ఇప్పటి వరకు 10మందికి పైగా పోలీసులు కరోనా వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓ కానిస్టేబుల్ కరోనాతో మృతి చెందాడు.
పాతబస్తీలో ఓ ఎస్సైకి కరోనా...
పాతబస్తీలో పనిచేస్తున్న ఓ ఇన్స్పెక్టర్కు కరోనా సోకడం వల్ల ఆ ఠాణాలో పనిచేస్తున్న పోలీసులందరికీ వైద్యపరీక్షలు నిర్వహించారు. అదృష్టవశాత్తు అందరికీ నెగిటివ్ వచ్చింది. ఉత్తర మండల పరిధిలోని ఠాణాలో పనిచేస్తున్న ఓ ఎస్సైకి కరోనా సోకింది. ఠాణాతో పాటు అతని కుటంబ సభ్యులందరికీ వైద్యపరీక్షలు నిర్వహించగా... ఎవరికీ వైరస్ సోకినట్లు తేలకపోవడం ఊరటనిచ్చే అంశం. ఓ కమిషనరేట్‌లో సాంకేతిక విభాగంలో పనిచేసే కానిస్టేబుల్ కూడా కరోనా బారినపడ్డారు.