తెలంగాణ

telangana

ETV Bharat / state

చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో కొందరు పోలీసులు - చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో కొందరు పోలీసులు

నేరాల్ని అడ్డుకుని, చట్టాల్ని కాపాడాల్సిన వారే చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నారు. కొంతమంది పోలీసులు అధికారాన్ని దుర్వినియోగం చేసి నిందితులకు కొమ్ముకాస్తుంటే... మరికొందరు బెదిరింపులకు దిగి భారీగా డబ్బులు గుంజుతున్నారు. ఇంకొంతమందైతే మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాలో తలమునకలవుతున్నారు. వరుసగా జరుగుతున్న ఈ తరహా ఘటనలు ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖ ప్రతిష్ఠకు మాయనిమచ్చగా మిగులుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చర్యలు తీసుకుంటున్నా.. మిగతావారిలో మార్పు రాకపోవడం గమనార్హం.

some-police-are-involved-in-illegal-activities-in-ap
చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో కొందరు పోలీసులు

By

Published : Sep 18, 2020, 10:28 AM IST

ఏం చేసినా చెల్లుతుందిలే!

తామేం చేసినా చెల్లుతుందనే భావన పోలీసుల్లో పెరిగిపోవటానికి ప్రధాన కారణం పైరవీలతో పోస్టింగులు దక్కించుకోవటమే. చాలాచోట్ల డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైల పోస్టింగుల్లో సిఫార్సులకే ప్రాధాన్యం లభిస్తోంది. కొంతమంది పోలీసులు స్థానిక నాయకులకు భారీగా డబ్బులు చెల్లించి కీలకపోస్టుల్లోకి వస్తున్నారనే ఆరోపణలున్నాయి. తాము ఖర్చు పెట్టినదానికి అంతకంతా రాబట్టుకోవడానికి సివిల్‌ పంచాయితీల్లో తలదూర్చటం, నిందితులకు కొమ్ముకాయటం, బాధితులనే బెదిరించటం, ప్రమాదం జరిగితే దాన్ని అక్రమార్జనకు అనుకూలంగా మలుచుకోవటం, అధికార పార్టీ నాయకుల కోసం స్టేషన్‌లోనే పంచాయితీలు చేయడం అలవాటుగా మార్చేసుకుంటున్నారు.

కొరవడిన పర్యవేక్షణ

క్షేత్రస్థాయి సిబ్బందిపై కొంత మంది ఎస్పీలకు పట్టు ఉండట్లేదు. అవినీతి ఆరోపణలు, అక్రమాల సమాచారాన్ని స్పెషల్‌ బ్రాంచ్‌ విభాగాల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుని.. దానికనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ఎస్‌బీ విభాగాల వైఫల్యంతో క్షేత్రస్థాయిలో ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలదే ఇష్టారాజ్యంగా మారుతోంది.

బిల్డర్‌ను బెదిరించి..

విజయవాడ పటమటలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్‌మెంటుకు రంగులు వేస్తూ... వెంకటేశ్వరరావు అనే కూలీ భవనంపై నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో భవన నిర్మాణదారును బెదిరించి భారీగా డబ్బులు గుంజారని సెంట్రల్‌ జోన్‌ ఏసీపీ నాగరాజారెడ్డిపై ఫిర్యాదులొచ్చాయి. గతంలోనూ ఆయనపై ఇలాంటి ఆరోపణలు రావటంతో అధికారులు విచారణ జరిపారు. అవన్నీ నిజమని తేలడంతో ఏసీపీని ఇటీవలె సస్పెండ్‌ చేశారు.

మద్యం, గంజాయి అక్రమ రవాణాలో 56 మంది

మద్యం, గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతూ గత నాలుగు నెలల్లో 56 మంది పోలీసులు ఎస్‌ఈబీకి పట్టుబడ్డారు. ఇందులో ఎక్కువ మంది కానిస్టేబుళ్లే. వీరందరిపైన కేసులు పెట్టి రిమాండుకు పంపించారు. ఏపీలో మద్యం ధరలు అధికంగా ఉండటంతో వీరంతా పక్కరాష్ట్రాల నుంచి స్మగ్లింగ్‌ చేస్తూ చిక్కారు.

  • జూద స్థావరాల వద్ద స్వాధీనం చేసుకున్న ద్విచక్రవాహనాలను విడుదల చేయటానికి లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై రంపచోడవరం ఇన్‌స్పెక్టర్‌ బీహెచ్‌.వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు కె.బుర్రన్నదొర, ఎం.సత్యప్రసాద్‌ ఇటీవల సస్పెండయ్యారు.
  • మహిళ అదృశ్యం కేసులో లంచం తీసుకున్నారని దువ్వాడలో ఏఎస్సై టి.రమణను సస్పెండ్‌ చేశారు.

హత్యను అనుమానాస్పద మృతిగా మార్చేసి

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామన్నపేటకు చెందిన దొంతిన వెంకటేశ్వరరెడ్డి ఈ ఏడాది మార్చిలో రైలు పట్టాలపై శవమై కనిపించారు. ఆయన తలపై గొడ్డలి వేటు, శరీరంపై గాయాలున్నా పోలీసులు హత్య కేసు కాకుండా అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. వెంకటేశ్వరరెడ్డిని ముందు రోజు ఒక వ్యక్తి తీసుకెళ్లాడని, అతని చేతిలో గొడ్డలి కూడా ఉందని ఆయన కుటుంబసభ్యులు చెప్పినా ఎస్సై అజయ్‌బాబు పట్టించుకోలేదు. నిందితులకు సహకరించేందుకే హత్య కేసును పక్కదారి పట్టించారని ఉన్నతాధికారుల విచారణలో తేలటంతో అజయ్‌బాబును సస్పెండ్‌ చేశారు.

సివిల్‌ పంచాయతీ ఖరీదు.. ఓ ప్రాణం

ఓ విశ్రాంత అదనపు ఎస్పీకి చెల్లించాల్సిన సొమ్మును ఇవ్వలేదనే కారణంతో దాసరి మాల్యాద్రి అనే వ్యక్తిని ఒంగోలు తాలూకా స్టేషన్‌కు పిలిపించి అక్రమంగా నిర్బంధించారు. అవమానంగా భావించిన మాల్యాద్రి మర్నాడే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అధికారులు ఇన్‌స్పెక్టర్‌ ఎం.లక్ష్మణ్‌ది తప్పని తేల్చి సస్పెన్షన్‌ వేటు వేశారు.

ఇదీ చదవండి:కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎన్‌ఆర్‌ఐ కోటాకే సగం సీట్లు

ABOUT THE AUTHOR

...view details