వైరస్ సోకిన వ్యక్తితోపాటు.. కలివిడిగా మెలిగిన వారందరికీ పరీక్షలు చేయాల్సి ఉంది. హైదరాబాద్‌లో పాజిటివ్ అని తేలిన 500 మందికిపైగా ఆచూకీ లభించట్లేదు. వారంతా ఎక్కడున్నారు.. ఆరోగ్య పరిస్థితి ఏంటో తెలియట్లేదు. పరీక్షలు చేయించుకునేటప్పుడు నకిలీ పేరు, తప్పుడు చిరునామా, ఫోన్ నంబర్లు ఇవ్వడమే అందుకు కారణం. కొందరు పాజిటివ్ అని తేలిన రెండు, మూడు రోజులకు స్థానిక ఆరోగ్య కేంద్రాలను సంప్రదిస్తున్నారని, కొందరు వారం దాటినా అందుబాటులోకి రావట్లేదని వైద్య ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
స్పష్టత లేని సమాచారంతో..
జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రభుత్వం రోజుకు 3 వేల మేర నమూనాలు పరీక్షిస్తోంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన పరీక్ష కేంద్రాలు, ప్రైవేటు ల్యాబ్‌ల్లో ప్రక్రియ కొనసాగుతోంది. ప్రైవేటు లాబ్‌ల ముందు ఉదయం నుంచే జనం వరుసలో నిలబడి కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. పోలీసులు, జర్నలిస్టులు, వైద్య సిబ్బందికి ప్రత్యేక శిబిరాల్లో నమూనాలు తీసుకుంది. ఆక్రమంలో అభ్యర్థులు ఓ దరఖాస్తు నింపాల్సి ఉంటుంది. అందులో పేరు, పూర్తి చిరునామా, ఫోన్ నంబరు, ఆధార్ సంఖ్య, వ్యాధి లక్షణాలను పొందుపరచాలి. ఆ నిబంధన పూర్తిస్థాయిలో అమలు కాలేదు.