తహసీల్దారుపై కొందరు దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విధి నిర్వహణలో ఉన్నఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా మక్కువ మండల తహసీల్దారు దొడ్డి వీరభద్రరావును కొట్టడం కలకలం రేపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం మండలంలోని ములక్కాయవలసలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు 1.8 ఎకరాల భూమిని ఎంపిక చేశారు. ఈ స్థలంలో చాలా ఏళ్లుగా సాగుచేస్తున్నామంటూ అదే గ్రామానికి చెందిన సాలాపు కోటేశ్వరరావు కుటుంబీకులు లేఅవుట్లు వేసేందుకు వచ్చిన అధికారులను పలుమార్లు అడ్డుకుంటూ వచ్చారు.
సెప్టెంబరు 1న ఆ భూమిలో వ్యవసాయ పనులు చేస్తున్నట్లు సమాచారం రావడంతో పనులు అడ్డుకునేందుకు తహసీల్దారు, ఆర్‌ఐ, సర్వేయరు, మహిళా పోలీసు చేరుకున్నారు. చుట్టూ వేసిన కంచె తీసేందుకు తహసీల్దారు ప్రయత్నించడంతో సదరు కుటుంబ సభ్యులు ఆయనపై దాడికి దిగారు. దీంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తహసీల్దారు తెలిపారు. అయితే కోటేశ్వరరావు కుటుంబం ఈ భూమిని ఓ వ్యక్తి వద్ద లీజుకు తీసుకుని 18 ఏళ్లుగా సాగు చేస్తోంది. దీన్ని డీపట్టా భూమిగా గుర్తించి, లేఅవుట్లు వేశారు. సదరు కుటుంబం ఆందోళ చేస్తుండటంతో పట్టాల పంపిణీ ఆలస్యమైంది. ఎట్టకేలకు శుక్రవారం సీఆర్‌పీఎఫ్ డీఎస్పీ ఆషూ కుమారి పట్టాలు పంపిణీ చేశారు. తమకు న్యాయం చేయాలంటూ రైతు కుటుంబీకులు పార్వతీపురం ఆర్డీవో కార్యాలయానికి వెళ్లారు.