తెలంగాణ

telangana

ETV Bharat / state

యాసిడ్‌ తాగితే నరకమే, 20 ఏళ్లలో 600 మంది బాధితులకు అక్కడ చికిత్స - health issues for Acid Victims

Treatment for Acid Victims కొందరు వ్యక్తులు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకునే క్రమంలో యాసిడ్​ను తాగి నరకం అనుభవిస్తున్నారు. గత అయిదేళ్లలో నిమ్స్​లోనే 189 మంది ఇలా చేరారు. ఇలాంటి ఘటనల్లో దాదాపు 95 శాతం మందిని సంక్లిష్టమైన సర్జరీల ద్వారా అక్కడి వైద్యులు కాపాడారు.

Treatment for Acid Victims
Treatment for Acid Victims

By

Published : Aug 27, 2022, 9:45 AM IST

Treatment for Acid Victims : కారణాలు ఏవైనా... కొందరు క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకునే క్రమంలో బాత్‌రూమ్‌ను శుభ్రం చేసే యాసిడ్‌ను తాగేసి నరకం అనుభవిస్తున్నారు. గత అయిదేళ్లలో కేవలం నిమ్స్‌లోనే 189 మంది ఇలా చేరారు. రెండు దశాబ్దాల్లో దాదాపు 600 మంది బాధితులకు ఈ ఆసుపత్రి వైద్యులు అండగా నిలిచారు. 95 శాతం మందిని సంక్లిష్టమైన సర్జరీల ద్వారా కాపాడారు.

అత్యంత ప్రమాదకరం:యాసిడ్‌ తాగిన వెంటనే గొంతు నుంచి ఆహారవాహిక ద్వారా జీర్ణాశయానికి చేరుతుంది. 95 శాతం మందిలో చనిపోయే పరిస్థితి ఉండదు. కానీ శరీరంలో అది ప్రయాణించే మార్గమంతా తీవ్రంగా కాలిపోయి మాంసం ముద్దగా మారిపోతుంది. కొందరికి స్వరపేటికలు దెబ్బతింటాయి. ఫలితంగా మాట్లాడలేరు. మాట రావడానికి చాలారోజులు పడుతుంది. అన్నవాహిక కాలిపోతుంది.

ఉదరం పైభాగంలో ఉన్న ప్లీహం కూడా దెబ్బతింటుంది. జీర్ణకోశంపై ప్రభావం చూపుతుంది. దెబ్బతిన్న అవయవాలను క్లిష్టమైన శస్త్రచికిత్సతో తొలగించాల్సి ఉంటుంది. ఈ చికిత్సకు ప్రైవేటులో రూ.10-15 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధితో ఉచితంగా సేవలు అందిస్తున్నారు. ఇతరులకైతే రూ.3 లక్షల వరకు ఖర్చవుతుంది.

5 మి.మి. నోట్లోకి వెళ్లినా...అంతే: 5 మి.మి. యాసిడ్‌ తీసుకున్నాసరే.. అది ప్రమాదకరమే. యాసిడ్‌ తాగి వచ్చిన వారి అవయవాల పరిస్థితిని తొలుత బేరియం ఎక్సరే ద్వారా అంచనా వేస్తాం. 95 శాతం మందిలో అన్నవాహిక, జీర్ణకోశం పూర్తిగా దెబ్బతింటాయి. వెంటనే సర్జరీ చేయడం కుదరదు. పొట్ట వద్ద చిన్న శస్త్రచికిత్స చేసి పైపు ద్వారా ఆహారం అందిస్తూ...రకరకాల పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఇందుకు 3-4 నెలల సమయం పడుతుంది. తదుపరి రోగి పెద్దపేగులోని కొంత భాగాన్ని కత్తిరించి దానిని అన్నవాహికగా పునరుద్ధరించి చిన్నపేగులతో అనుసంధానం చేస్తాం. తినే తిండి పొట్టలోకి కాకుండా నేరుగా చిన్నపేగులకు.. అక్కడి నుంచి పెద్దపేగులకు చేరుతుంది. ఈ సర్జరీకి 7-8 గంటలు పడుతుంది. పూర్తిస్థాయిలో నోటితో ఆహారం తీసుకున్న తర్వాత పొట్ట వద్ద ఏర్పాటు చేసిన పైపును తొలగించేస్తాం. అనంతరం అన్ని రకాల ఆహారాన్ని తీసుకోవచ్చు. -డాక్టర్‌ బీరప్ప, విభాగాధిపతి, సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ

ABOUT THE AUTHOR

...view details