వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల బాధ్యతలను కొన్ని జిల్లాల్లో నాయబ్ తహసీల్దార్లకు (డీటీ) అప్పగిస్తుండటంపై రెవెన్యూ వర్గాల్లో అయోమయం నెలకొంది. భూ సమస్యలు, ఇతర కీలకమైన సేవలను తహసీల్దార్లు నిర్వహించాల్సి ఉండటంతో ధరణి బాధ్యతలను డీటీలకు కేటాయించేందుకు ఉన్న మార్గాలపై రెవెన్యూ శాఖ కొంతకాలంగా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. దీనిలో భాగంగానే కొన్ని జిల్లాల్లో డీటీలను ధరణి బాధ్యతలు చూడాలని కలెక్టర్లు సర్క్యులర్లు జారీ చేస్తున్నట్లు సమాచారం.
2020లో రూపొందించిన కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం తహసీల్దారు సంయుక్త సబ్ రిజిస్ట్రార్ హోదాలో ధరణి పోర్టల్లోని భూ దస్త్రాల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు చేసే అధికారాన్ని కలిగి ఉన్నారు. జీవో ఎంఎస్ నం.118లోనూ దీనికి సంబంధించిన నిబంధనలను పేర్కొన్నారు. ఏదైనా అత్యవసర సమయం లేదా తహసీల్దారు సెలవులో ఉంటే డిప్యూటీ తహసీల్దారు కలెక్టర్ ఆదేశాల మేరకు ధరణి బాధ్యతలను చేపడతారు. డీటీలకు పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించేందుకు జిల్లాల్లో కొందరు కలెక్టర్లు ఏర్పాట్లు చేస్తుండటం రెవెన్యూ వర్గాల్లో అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. పలు జిల్లాల్లో డీటీలకు బాధ్యతలు బదిలీ చేస్తూ కలెక్టర్ల సర్క్యులర్లు సైతం ఇస్తున్నారు. ఒకవేళ శాశ్వతంగా డీటీలకు రిజిస్ట్రేషన్ల బాధ్యతలు బదిలీ చేస్తే తహసీల్దారు పేరుతో కొనసాగుతున్న భూ దస్త్రాల జారీ ప్రక్రియలో మార్పులు తప్పనిసరి.