తెలంగాణ

telangana

ETV Bharat / state

34 బల్దియా కార్యాలయాలపై సౌర విద్యుదుత్పత్తి - జీహెచ్​ఎంసీ వార్తలు

పునరుత్పాదక శక్తి వినియోగంలో జీహెచ్‌ఎంసీ మరో మైలురాయి చేరుకుంది. ఏడాది క్రితం శ్రీకారం చుట్టిన సౌర ఫలకాల ప్రాజెక్టు ఫలాలు అందుతున్నాయి. వాటితో విద్యుత్​ ఖర్చును ఆదా చేసుకునేందుకు రంగం సిద్ధమైంది.

34 బల్దియా కార్యాలయాలపై సౌర విద్యుదుత్పత్తి
34 బల్దియా కార్యాలయాలపై సౌర విద్యుదుత్పత్తి

By

Published : Jan 4, 2021, 7:46 AM IST

సౌరఫలకాల ప్రాజెక్టు ద్వారా జీహెచ్​ఎంసీ విద్యుత్ ఖర్చులకు పరిష్కారం కనుగొంది. ఇప్పటికే జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డులో చెత్తను మండించి రోజుకు 19.8 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తోంది. అదనంగా బల్దియా కార్యాలయాలపై ఏర్పాటు చేసిన సౌర ఫలకలతో ఫలితాన్ని పొందుతోంది. ఏడాది క్రితం శ్రీకారం చుట్టిన ఈ ప్రాజెక్టు పనులు కొవిడ్‌కు ముందు పూర్తయ్యాయి. ఇప్పుడు సగం కార్యాలయాల్లో 100శాతం, మిగిలిన చోట్ల 90శాతం అవసరాలు సౌర విద్యుత్తు తీరుస్తోంది. మొత్తంగా ఏడాదికి రూ.1.5కోట్ల మేర కరెంటు బిల్లుల వ్యయం ఆదా అవుతోంది. జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డులో మరో కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.

పొదుపు మార్గం చూపిన ఎల్​ఈడీలు

నగరవ్యాప్తంగా ఎల్‌ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేయడం వల్ల ఇప్పటికే జీహెచ్‌ఎంసీ సగం విద్యుత్తును ఆదా చేస్తోంది. దీనితో అధికారులు 34 ప్రభుత్వ భవనాలపై సోలార్‌ పేట్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(టీఎస్‌రెడ్కో) సహకారంతో ప్రాజెక్టు పూర్తయింది. ఒప్పందం ప్రకారం నిర్వహణను టీఎస్‌రెడ్కో ఐదేళ్లు చూడనుంది. ఒక్కో సౌర పలక సగటున ఏడాదికి 1,500 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసేలా టీఎస్‌రెడ్కో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం బల్దియా ఉపయోగించుకుంటున్న యూనిట్‌ విద్యుత్తుకు సుమారు రూ.9లు చెల్లిస్తోంది. సౌర విద్యుత్తు వల్ల ఆ మేర ఖర్చు ఆదా అవుతోంది.

ఎంతో లాభం..

సహజ వనరులను ఉపయోగించుకోవడం వల్ల పర్యావరణానికి చాలా మేలు జరుగుతుంది. సంప్రదాయ విద్యుత్తు వినియోగం ఆదా అవుతుంది. దాని ఉత్పత్తికి అయ్యే ఖర్చు, ఉత్పత్తయ్యే కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. ఎల్‌ఈడీ ప్రాజెక్టు, వ్యర్థాల నుంచి విద్యుత్తు ప్రాజెక్టులకు సౌర విద్యుత్తు తోడైతే జీహెచ్‌ఎంసీ పర్యావరణ పరిరక్షణలో చాలా ముందున్నట్లు అవుతుందని జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

  • సౌరఫలకల సామర్థ్యం 941 మెగావాట్లు
  • ఏర్పాటు చేసిన కార్యాలయాలు 34
  • ప్రాజెక్టు వ్యయం రూ.4.5 కోట్లు
  • ఇందులో కేంద్రం ఇవ్వనున్న రాయితీ 25శాతం
  • ఏటా ఆదా అవనున్న విద్యుత్తు బిల్లులు రూ.1.4 కోట్లు

ఇదీ చూడండి:నేటి నుంచి ప్రారంభం కానున్న పదోన్నతుల ప్రక్రియ

ABOUT THE AUTHOR

...view details