సామాజిక మాధ్యమాల్లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే వందలాదిమంది మహిళల జీవితాలతో ఆడుకున్న ఓ మృగాడి పాపం పండింది. చదివింది ఉన్నత విద్య. చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగం. అదికూడా పెద్ద సంస్థలో.. పైకి ఎంతో హుందాగా కనిపించే ఆ కీచకుడిలో కనిపించని మృగాడు ఉన్నాడు. చెన్నైకి చెందిన క్లైమెట్ రాజు అలియాస్ ప్రదీప్ సామాజిక మాధ్యమాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న మహిళల వివరాలు సేకరించి ఉద్యోగాలిప్పిస్తానంటూ నమ్మబలికేవాడు. మంచి ఉద్యోగం వస్తుందనే ఆశతో అతను చెప్పినట్లుగా చేసి వందలాదిమంది చిక్కుల్లో పడ్డారు.
ఇంతమందిని ఎలా మోసం చేశాడంటే...
ఉద్యోగంకోసం దరఖాస్తు చేసుకున్న మహిళల వివరాలు సేకరించి వారిని ఫోనులో సంప్రదించేవాడు. ఓ ప్రముఖ హోటల్లో రిసెప్షనిస్టు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పేవాడు. మరిన్ని వివరాల కోసం హోటల్‌కు చెందిన ఓ మహిళా ప్రతినిధి మిమ్మల్ని వాట్సాప్ ద్వారా సంప్రదిస్తుందని చెప్పేవాడు. తానే మహిళగా పరిచయం చేసుకుని ఉద్యోగార్థులతో చాటింగ్ చేసేవాడు. ఉద్యోగం కోసం ఫోటోలు పంపాలని కోరేవాడు. పూర్తి వివరాలు పంపిన తర్వాత శరీరాకృతి తెలుసుకోవాలని పొట్టి దుస్తులు వేసుకుని ఫోటోలు పంపమనేవాడు. ఉద్యోగం వస్తుందని చాలా మంది అలాగే పంపారు. తర్వాత మీరు మొదటి దశలో ఎంపికయ్యారని శరీర దృఢత్వం తెలుసుకోడానికి నగ్నచిత్రాలు పంపాలని కోరేవాడు. తాము పంపుతున్నది మహిళకే కదా అనుకుని అడిగినట్లుగా చాలా మంది నగ్నచిత్రాలు పంపేవారు. ఆ తర్వాతే అసలు ముసుగు తీసి నిజస్వరూపం బయటపెట్టేవాడు.
ఫోటోలు పంపిన వారికి వీడియోకాల్‌చేసి మాట్లాడతాడు.రిసెప్షనిస్ట్గాతుది దశ ఎంపిక చేయడానికి అర్హతలు తెలుసుకునేందుకు నగ్నంగా కనపడాలని చెప్పేవాడు. పంచతార హోటల్లో పనిచేయాలంటే ఇవన్నీ తప్పవని నమ్మబలికేవాడు. మంచి ఉద్యోగం కదా అన్న ఆశతో కొందరు అతను చెప్పినట్లే చేశారు. వాటిని రికార్డిగ్ చేసి వేధింపులకు గురిచేసేవాడు.