‘పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామనే వారికి.. అసలు వికేంద్రీకరణకు అర్థమేంటో తెలుసా?’ అని సోషలిస్టు పార్టీ సీనియరు నాయకుడు రావెల సోమయ్య ప్రశ్నించారు. ఒకే రాజధాని.. అదీ రాష్ట్రం మధ్యలోనే ఉండాలని, సచివాలయం అక్కడే ఉండాలని స్పష్టం చేశారు.
తుళ్లూరుకు చెందిన సోమయ్య డిగ్రీ చదివే రోజుల్లోనే సోషలిస్టు పార్టీవైపు ఆకర్షితులయ్యారు. 1967 ఎన్నికల్లో తాడికొండ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు ఆయన వయసు 86 ఏళ్లు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై లోతైన అవగాహన ఉన్న ఆయన..రాజధాని తరలింపుపై తన అభిప్రాయాలను ‘ఈనాడు- ఈటీవీ భారత్’ ముఖాముఖిలో వెల్లడించారు.
1953లోనే రాజధాని డిమాండ్
గుంటూరు- విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఈనాటిది కాదు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు రాజధాని ఎక్కడ ఉండాలన్న అంశంపై విస్తృత చర్చ జరిగింది. విజయవాడ- గుంటూరు మధ్యే రాజధాని ఏర్పాటు చేయాలని కమ్యూనిస్టు పార్టీ గట్టిగా పట్టుబట్టింది. ఇక్కడైతే రాష్ట్రానికి మధ్యలో, అందరికీ సమాన దూరంలో ఉంటుందని భావించారు. పెద్ద రైల్వేజంక్షన్ ఉండటం అనుకూలమనీ వాదించారు. కానీ అప్పట్లో శ్రీబాగ్ ఒప్పందం నేపథ్యంలో.. కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు పెట్టడంవల్ల ఈ ప్రాంతానికి అవకాశం తప్పిపోయింది. ఇక్కడ రాజధాని ఏర్పాటు చేయాలని 2014లో నిర్ణయం తీసుకున్నాక... ఈ ప్రాంత ప్రజల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి కలిసి ఒక మహానగరం అవుతుందని అందరూ ఆశించారు.
కావాలంటే అసెంబ్లీనే విశాఖలో పెట్టుకోండి
విశాఖలో సచివాలయం, అమరావతిలో శాసనసభ, కర్నూలులో హైకోర్టు పెట్టడం పరిపాలనా వికేంద్రీకరణ ఎలా అవుతుంది? స్థానిక సంస్థల బలోపేతంతోనే అధికార వికేంద్రీకరణ సాధ్యమని చెప్పే లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ మూడు రాజధానుల ప్రతిపాదనను ఎందుకు వ్యతిరేకించడం లేదు? అసలు మూడు రాజధానులకు అర్థం లేదు. రాజధాని అంటే సచివాలయమే. ప్రజలకు ఎక్కువ అవసరం ఉండేది సచివాలయంతోనే. కాబట్టి అది రాష్ట్రానికి మధ్యలోనే ఉండాలి. కేంద్రం అంగీకరిస్తే హైకోర్టును కర్నూలులో పెట్టినా ఫర్వాలేదు. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలను విశాఖలో పెడితే, అనంతపురం జిల్లావారు అక్కడికి వెళ్లాలంటే ఎంత కష్టం. కావాలంటే అసెంబ్లీని విశాఖలో పెట్టుకోమనండి. సచివాలయం అమరావతిలోనే ఉండాలి.
చంద్రబాబు ప్రారంభించిన ప్రాజెక్టులను వైఎస్ కొనసాగించలేదా?
రాజధాని వస్తే తమ ప్రాంతంలో ఐటీ, ఇతర పరిశ్రమలు వస్తాయని, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆశపడి అక్కడి రైతులు భూములిచ్చారు. రాజధానిని తరలిస్తామనడం వారికి ద్రోహం చేయడమే. హైదరాబాద్లో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన అభివృద్ధిని, ఆయన తర్వాత అధికారంలోకి వచ్చిన రాజశేఖరరెడ్డి కొనసాగించారు కదా. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పాలకులు చేస్తున్నట్టుగా దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగలేదు.