వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుని వివిధ కోర్సుల్లో అర్హత సాధిస్తూ తాము ఎందులోనూ తీసిపోమని నిరూపిస్తున్నారు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు. నీట్, ఐఐటి, పైలెట్, డిగ్రీ, ఇంటర్, ఎస్ఎస్సీ ఇలా అన్నింటా ర్యాంకులతో దూసుకుపోతున్నారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో చదువుకుంటున్న విద్యార్థులు అదరగొట్టారు.
లక్షా 56 వేల మంది విద్యార్థుల్లో పలువురు... దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థలు, యూనివర్సిటీల్లో ప్రవేశాలు దక్కించుకున్నారు.నీట్ పరీక్షలో 128 మంది విద్యార్థులు అఖిల భారత స్థాయిలో టాప్ ర్యాంకులు సాధించి సత్తా చాటారు. డాక్టర్ కలలను సాకారం చేయడంలో ఆపరేషన్ బ్లూ క్రిస్టల్ కోచింగ్ కార్యక్రమం బాగా ఉపయోగపడింది. విజయవంతమైన విద్యార్థుల జాబితాలో వ్యవసాయ కూలీలు, కార్మికులు, ఆటో డ్రైవర్ల సంతానం ఉంది.
అలాగే 46 మంది విద్యార్థులు ప్రీమియర్ ఐఐటీలలో, 82 మంది నిట్‌లో అడ్మిషన్ పొందారు. 30 మంది విద్యార్థులు సెంట్రల్ ఫండెడ్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో సీట్లు పొందారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్ కోర్సుకు ఎంపికైన ఇద్దరు విద్యార్ధులు ఎంతో మందికి ఆదర్శమయ్యారు.