distress state of roads: ఏపీలోని రోడ్ల దుస్థితిపై సామాజిక మాధ్యమాల్లో వ్యంగ్య చిత్రాలు, వ్యాఖ్యానాలు, వీడియోలు వెల్లువెత్తుతున్నాయి. అధ్వాన రహదారులపై అష్టకష్టాలు పడుతున్న ప్రజలు.. ఆ బాధను, ఆవేదనను సామాజిక మాధ్యమాలే వేదికగా వ్యక్తపరుస్తున్నారు. పెద్ద పెద్ద గోతులతో ఛిద్రమైన రహదారుల చిత్రాలు, వీడియోలకు.. తమలోని సృజనకు పదునుపెట్టి వ్యంగ్య వ్యాఖ్యలు జోడించి పోస్టు చేస్తున్నారు. వివిధ సినిమాల్లోని దృశ్యాలను తీసుకుని, వాటికి ఆసక్తికరమైన వ్యాఖ్యలు జోడిస్తూ ప్రచారంలో పెడుతున్నారు. రహదారుల అధ్వాన పరిస్థితిపై కొందరు ప్రముఖులు చేసిన వ్యాఖ్యలూ వైరల్ అవుతున్నాయి. రోడ్ల దుస్థితిపై తెదేపా, జనసేన సామాజిక, డిజిటల్ మాధ్యమాల్లో చేస్తున్న వినూత్న ప్రచారానికీ ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
చినజీయర్, కేటీఆర్ వ్యాఖ్యలకు విస్తృత వ్యాప్తి
ఆధ్యాత్మిక వేత్త చిన జీయర్ స్వామి కొన్ని రోజుల క్రితం రాజమహేంద్రవరంలో ధార్మిక ప్రసంగం చేస్తూ.. ‘ప్రయాణం చేసేటప్పుడు ఒడుదొడుకులు ఉండొచ్చు. దటీజ్ ఓకే. ఒక్కోసారి గోతులు ఎక్కువ ఉండొచ్చు. మేం జంగారెడ్డిగూడెం నుంచి ఇక్కడివరకు రావడానికి.. (కాస్త ఆగి) ‘చాలా’ బాగుంది. చక్కగా జ్ఞాపకం ఉండేట్టుగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రహదారుల అధ్వాన స్థితిపై నర్మగర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొట్టాయి.
* ఏప్రిల్ 29న హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలూ అదే స్థాయిలో వైరలయ్యాయి. ‘నా స్నేహితుడు ఒకాయన సంక్రాంతికి పక్క రాష్ట్రానికి వెళ్లొచ్చి నాకు ఫోన్ చేశారు. తెలంగాణలోని ప్రతి గ్రామం నుంచి 4 బస్సులు పెట్టి జనాన్ని పక్క రాష్ట్రానికి ఒకసారి పంపించాలని, అప్పుడే ఇక్కడి పరిస్థితులు ఎంత మెరుగ్గా ఉన్నాయో వారికి అర్థమవుతుందని చెప్పారు. పక్క రాష్ట్రంలో నీళ్లు, కరెంటు లేవని, రోడ్లు ధ్వంసమయ్యాయని.. పరిస్థితి అన్యాయంగా, అధ్వానంగా ఉందని చెప్పారు. తిరిగి ఇక్కడికి వచ్చాకే ఊపిరి పీల్చుకున్నట్లుగా ఉందన్నారు. నేను చెబుతోంది అతిశయోక్తి అనిపిస్తే మీరు కారేసుకుని పక్క రాష్ట్రం బయల్దేరండి. అప్పుడే మనల్ని ఎక్కువగా అభినందిస్తారు’ అని సభికుల్ని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని పోస్టులకు జోడిస్తున్నారు.
వ్యంగ్యం, బాధ కలగలుపు
రోడ్ల దుస్థితిపై పెడుతున్న పోస్టులు, మీమ్స్.. వ్యంగ్యానికి, బాధకు అద్దం పడుతున్నాయి. ఒకపక్క నవ్వు.. మరోపక్క బాధ పుట్టిస్తున్నాయి. ‘చంద్రబాబు హయాంలో కారు సంవత్సరానికి ఒకసారి షెడ్డుకెళితే, ఇప్పుడు 4 నెలలకోసారి వెళుతోంది. దానివల్ల మెకానిక్ ఎంత బాగుపడుతున్నాడు? కారు ఏడాదికోసారి షెడ్డుకొస్తే సర్వీసు సెంటర్లవాళ్లు, మెకానిక్‌లు, మేస్త్రీలు ఏమైపోతారు? చంద్రబాబువల్ల వారి ఉపాధి దెబ్బతింది. జగన్ వచ్చాక వారంతా బాగుపడ్డారు’ అంటూ ఓ వ్యక్తి పెట్టిన పోస్టు అలాంటిదే.
* మీరు చెప్పిన లొకేషన్‌లో ఖాళీ స్థలం ఉందిగానీ, ఇల్లు లేదంటూ డెలివరీ బాయ్ ఓ ఇంటాయనకు ఫోన్ చేస్తాడు. అప్పుడాయన ‘బాబూ నువ్వు మెయిన్ రోడ్డు మీదకు వచ్చేయి. అక్కడ ఒక పెద్ద గుంతలో లారీ దిగబడిపోయి ఉంటుంది. కొంత ముందుకొచ్చాక ఎడమవైపునకు తిరిగితే అన్నీ గుంతలే కనిపిస్తాయి. ఇంకొంచెం ముందుకొస్తే మరో పెద్ద గొయ్యి, దానిలో ఒక కారు కూరుకుపోయి ఉంటుంది. ఇంకొంచెం ముందుకొస్తే రెండు చిన్న గుంతలు దాటగానే మూడో గుంత కనిపిస్తుంది. దాని ఎదురుగానే మా ఇల్లు’ అని చెబుతాడు. పక్కనే ఉన్న ఆయన భార్య ‘అడ్రస్ భలే చెప్పారండీ. ఈ గుంతలవల్ల మన పని సులువైపోయింది’ అని ముక్తాయిస్తుంది. అదిప్పుడు విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.
* ఓ యువకుడు లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్ ఎలా చేయాలో గూగుల్‌లో వెతుకుతాడు. తర్వాత ఇంట్లో నేలపై గీతలు గీసుకుని ప్రాక్టీస్ చేస్తుంటాడు. అది చూసి తండ్రి.. ఏరా ఒలింపిక్స్‌కు ఏమైనా వెళుతున్నావా? అని అడుగుతాడు. తర్వాత ఆ యువకుడు ఇంట్లో నుంచి వేగంగా పరుగెత్తుకుని వచ్చి ఎదురుగా రోడ్డుపైనున్న పెద్ద గుంతలను గెంతేస్తూ వెళ్లిపోతాడు. అతను చేసిన ప్రాక్టీసంతా ఆ గుంతల్ని దాటడానికని అర్థమవుతుంది. అది ఎక్కడో చేసిన వీడియో అయినా.. రాష్ట్రంలో ప్రస్తుతం రోడ్ల అధ్వాన పరిస్థితికి చక్కగా సరిపోతుందంటూ నెటిజన్లు ప్రచారంలో పెట్టారు.
ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం
అధ్వాన రహదారులపై ప్రయాణించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియోలు, వాటితో కలిపి పెడుతున్న పోస్టులు జనం ఆవేదనకు అద్దం పడుతున్నాయి.
* ఒక ఆటోడ్రైవర్ చెరువులా కనిపిస్తున్న రోడ్డుపై ఆటోను తోసుకుంటూ వెళుతూ.. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో వైరలవుతోంది. దానిలో ‘జగన్‌మోహన్‌రెడ్డిగారూ చూస్తున్నారా.. ఇది పామర్రు నియోజకవర్గం.. పామర్రు మండలం. మీ అనిల్ కుమార్ ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గం. ఆటోకు 10 వేలు వేస్తానన్నావు. ఇదిగో నా ఆటో. ఇప్పుడు బోర్ చేస్తే పాతిక వేలవుతుంది. అయ్యా మీకు, మీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఒక దండం’ అని చేతులు జోడించి అతను ఆవేదన వ్యక్తం చేశాడు.
* అత్తారింటికి దారేది సినిమాలో.. బ్రహ్మానందం, సమంత మధ్య జరిగే ఒక సరదా సన్నివేశాన్ని దీనికి వాడుకున్నారు. సమంత ‘స్వామీ నదికి పోలేదా’ అని అడిగినట్టు, దానికి బ్రహ్మానందం ‘ఆ దిక్కుమాలిన రోడ్లమీద నదికి పోవడం కన్నా నరకానికి వెళ్లడం ఉత్తమమని వచ్చేశాను దేవీ’ అని బదులిచ్చినట్టు క్యాప్షన్ పెట్టారు.
* మంత్రి రోజా.. వైకాపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రోడ్డుపై నీటితో నిండిన గుంతలో వరినాట్లు వేస్తూ నిరసన తెలిపిన ఫొటోకు.. ‘ఇప్పుడెక్కడ దాక్కున్నారు? ఇప్పుడైతే రోడ్లమీద అన్ని పంటలూ పండించెయ్యొచ్చు’ అన్న క్యాప్షన్‌తో పోస్టు పెట్టారు.