Social And Emotional Skills Programme In Telangana Students : విద్యార్థుల్లో సామాజిక, భావోద్వేగ నైపుణ్యాలను పెంచేందుకు దిల్లీ తరహాలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం, మానసిక, భావోద్వేగ శ్రేయస్సు, సామాజిక నైపుణ్యాలు దెబ్బతినకుండా వారిలో మనో ధైర్యం కల్పించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో జిల్లాకు ఒక పాఠశాల చొప్పున 6, 7వ తరగతి విద్యార్థులను ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ఆమె తెలిపారు.
విద్యార్థుల్లో ప్రతికూల పరిస్థితులను, ఇబ్బందులను తొలగించి భవిష్యత్ పట్ల ఆశావాద దృక్పథాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని మంత్రిసబితా ఇంద్రారెడ్డి వివరించారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో ఇద్దరేసి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థి దశలోనే వ్యాపార ఆవిష్కరణలు ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు. మొదటి దశలో 8 జిల్లాలోని 24 మోడల్ స్కూళ్లను ఎంపిక చేసి ఇంటర్ మొదటి సంవత్సరం చదివే 2,500 మంది విద్యార్థులను వ్యాపార ఆవిష్కరణలపై ప్రోత్సహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇలా చేయడం వల్ల విద్యార్థుల్లో ఆలోచనా శక్తి పెరిగి, భవిష్యత్తులో దేశానికి ఉపయోగపడే భావిభారత పౌరులుగా తీర్చదిద్దబడతారని సబితా ఇంద్రారెడ్డి అన్నారు.