నగరీకరణపై అధిక రక్తపోటు విరుచుకుపడుతోంది. పల్లెల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో హైబీపీ బాధితులు అధికంగా నమోదవుతున్నారు. మహిళల్లో కంటే పురుషుల్లో ఈ బాధితులు ఎక్కువ. తెలంగాణలోనూ 14.2% మందిని అధిక రక్తపోటు పీడిస్తోందని తాజా అధ్యయనం వెల్లడించింది. జాతీయ సగటు(11.3%) కంటే ఇది అధికం కావడం ఆందోళనకరమే.
‘టాటా సామాజిక విజ్ఞాన సంస్థ(టిస్) సౌజన్యంతో ‘జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే 2015-16’ నివేదికలోని అంశాల ఆధారంగా డా.సౌమిత్రా ఘోష్, డా.మనీష్‌కుమార్ నిర్వహించిన అధ్యయన పత్రాన్ని తాజాగా ‘బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించారు. వివిధ అంశాల ప్రాతిపదికన దేశవ్యాప్తంగా 15-49 ఏళ్ల మధ్యవయస్కులు 8,11,917 మంది నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించారు.
ముఖ్యాంశాలు..
- అధ్యయనంలో పాల్గొన్నవారిలో 51.3% మంది 15-29 ఏళ్ల మధ్యవయస్కులే.
- మొత్తం మందిలో మూడోవంతు పట్టణవాసులు, వీరిలో 25% మంది ఊబకాయ బాధితులు.
- దాదాపు 48% మంది పురుషులు, 10% మంది మహిళలు పొగాకు ఉత్పత్తులు స్వీకరిస్తున్నారు.
- 15-49 ఏళ్ల మధ్య వయస్కుల్లో తెలంగాణలో 90/140 కంటే బీపీ ఎక్కువగా ఉన్నవారు 14.2% మంది అని అంచనా.
- దేశంలో కేరళలో తక్కువ(8.2%)గా, సిక్కింలో అత్యధికం(20.3%)గా ఈ బాధితులున్నారు.
- రాష్ట్ర మహిళల్లో 13.6% మంది హైబీపీ బాధితులుండగా, పురుషులు 18.9% మంది.. జాతీయ స్థాయిలో మహిళలు 10.9%, పురుషులు 13.8% మంది హైబీపీతో బాధపడుతున్నారు.
- రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో అధిక రక్తపోటు బాధితులు 16.5% కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 12.6%గా నమోదైంది. జాతీయ స్థాయిలో పట్టణాల్లో 12.5%.. పల్లెల్లో 10.6% బాధితులు ఉన్నారు.