కొంచెం తాగితే ఏమవుతుందిలే.. తనిఖీల్లో చూసీచూడనట్లు వదిలేస్తారనే అన్న ధీమాతో రోడ్డెక్కినట్లు ఎక్కువ మంది చెబుతుండటంతో పోలీసులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ ఆరు నెలల్లో నమోదైన కేసులను పరిశీలించగా సుమారు 50 శాతం మంది ఈ కేటగిరీలోనే ఉన్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు.
సాధారణంగా మందుబాబుల రక్త నమూనాల్లో మద్యం మోతాదు (బీఏసీ)ను రక్త నమూనాలను విశ్లేషించి లెక్కిస్తారు. 100 ఎంఎల్ రక్తంలో మద్యం మోతాదు 30 ఎంజీ లోపు ఉంటే వదిలేస్తారు. 36, అంతకంటే ఎక్కువగా ఉంటే కేసు నమోదు చేస్తారు. 100 ఎంజీల్లోపు నమోదైన వాళ్లంతా కొంచెం తాగితే ఏమవుతుందిలే అంటూ బదులిచ్చారు. జనవరి నుంచి జూలై 3 వరకు 20,326 మంది మందుబాబులు పోలీసులకు చిక్కారు. వీరిలో 10,570 మంది బీఏసీ 100 ఎంజీల్లోపే ఉండటం గమనార్హం.
డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులే పట్టుపడుతున్నారు. వీరిలో 15,456 మంది ద్విచక్ర వాహనదారులే కావడం గమనార్హం. అంటే ఈ లెక్కన చూస్తే దొరికిపోయిన వాహనాల్లో 75 శాతానికి పైగా ఇవేనన్న మాట.